calender_icon.png 7 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్ కోడ్‌లపై వార్

07-12-2025 01:15:57 AM

ఢిల్లీలో సోనియా వ్యతిరేకించిన బిల్లును రాష్ట్రంలో ఎలా అమలుచేస్తారు? 

అమలును ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలను స్తంభింపజేస్తాం

శ్రమదోపిడీ వల్లే విమానయాన సంస్థల్లో సంక్షోభం 

రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తెలంగాణ నుంచే మొదలుపెడదామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. లేబర్ కోడ్‌లను రాష్ర్టంలో అమ లుచేయకుండా అడ్డుకుంటే దేశానికి రాష్ట్రం దిక్సూచి అవుతుందన్నారు. శనివా రం తెలంగాణ భవన్ వేదికగా ట్రేడ్ యూ నియన్లతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సోనియా గాంధీ ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలుచేస్తుందని ప్రశ్నించారు. నూతన కార్మిక చట్టాల నిలుపుదల కోసం ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుద్దామని చెప్పారు. లేబర్ కోడ్‌ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ దిశగా వరంగల్‌లో తదుపరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. 

‘ప్రపంచమే కు గ్రామం’ అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని చెప్పా రు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారని, సామాజిక స్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ చట్టా లు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు.

కేసీఆర్ పేదవారి సంక్షేమాన్ని ఎన్న డూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారని, సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్లలో రూ. 3,500 కోట్ల మేర బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కొందరు పిచ్చోళ్లు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షంలో ఉండగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారని, కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరఫున సాయం చేశారని గుర్తు చేశారు.

నాలు గు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేదని, ఇప్పుడు మనది నాలు గు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది అరవై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారిందని తెలిపారు. చైనా  ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకురాబట్టే ఫలితాలు సాధించిందని, అలాంటి వాటిపై ఈ దేశం లో చర్చ జరగదన్నారు. అన్నింటికీ మందు.. పోరాడే పార్టీకి పార్లమెంట్‌లో తగిన సీట్లు ఇవ్వడమేనని స్పష్టం చేశారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు ప్రాతిని ధ్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయని వి మర్శించారు. 

బడా పారిశ్రామిక వేత్తల కోసమే : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కార్మికుల హక్కులను హరించేలా లేబర్ కోడ్‌లు ఉన్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ కోడ్‌లతో భద్రత లేకుండా పోతోందని, కార్మికుల హక్కుల హననం విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాలు ఒక్కటే అని విమర్శిం చారు. పార్టీలు వేరైనా, రంగులు వేరైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఏకతాటిపై కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఆరోపించారు.

దేశంలో అన్ని పరిశ్రమలను చాపకింద నీరులా అదానీ హస్తగతం చేసుకుంటున్నారని, అలాంటి బడా పారిశ్రామిక వేత్తల కోసమే కొత్త లేబర్ కోడ్‌లు తీసుకొచ్చారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ కార్మిక సమ స్యలపై పోరాడేందుకు తెలంగాణ భవన్‌లో కాల్ సెంటర్ పెట్టాలని సూచించారు. 

ఉద్యమాలు జరగాలి: మాజీ ఎంపీ  

నాలుగు లేబర్ కోడ్‌లను పార్లమెంటు ఇప్పటికే ఆమోదించిందని, లేబర్ కోడ్‌లపై అనేక రాష్ట్రాలు నిబంధనలు రూపొందించకున్నా తెలంగాణ ప్రభుత్వం ఆదరా బాదరాగా తొందరపడి రూల్స్ రూపొందించిందని మాజీ ఎంపీ బీ.వినోద్ కుమార్ విమర్శించారు. పార్లమెంటు సరిగా పని చేయనందువల్లే ఇలాంటి చట్టాలు ఆమోదం పొందుతున్నాయని అన్నారు. 29 చట్టాలను నాలుగుకు కుదించారని, రైతుల చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గినట్టే లేబర్ కోడ్‌లపై చట్టాలు వెనక్కు తీసుకునేలా ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్ లేబర్ కోడ్‌లపై అవగాహన పెంచేందుకు అందరికన్నా ముందుగా స్పందించడం సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కేంద్రం తప్పుడు చట్టాలు తెచ్చినా ఇక్కడ నష్టం కా కుండా కార్మికులను కాపాడుకున్నారని, గతంలో ఈ లేబర్ కోడ్‌లపై కేంద్రం అభిప్రాయం అడిగినా కార్మికులకు వ్యతిరే కమ ని కేసీఆర్ స్పందించలేదని గుర్తుచేశారు. మిమిమం వేజెస్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్ లు వచ్చాయని స్పష్టం చేశారు. 

దుర్మార్గంగా లేబర్ కోడ్‌లు: దాస్యం 

కొత్త లేబర్ కోడ్‌లు దుర్మార్గంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. వీటిపై ఇంకా చాలా మందికి అవగాహన లేదని, కార్మికులకు ఈ కోడ్‌లు ఉద్యోగ భద్రత ను దూరంచేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య కారణాలు చెప్పినా కార్మికులకు సెలవులు ఇవ్వని దుస్థితి ఈ లేబర్ కోడ్‌లతో కలుగుతుందని వివరించారు.  

దొందూ దొందే: దేవీ ప్రసాద్

లేబర్ కోడ్‌లపై ఉమ్మడి ఉద్యమాలు అవసరమని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ బీజేపీలు దొందూ దొందే అని, ఆ రెండూ పార్టీలు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ కార్మిక హక్కులను హరిస్తుంటే, కాంగ్రెస్ కార్మికులనే లేకుండా చేస్తోందన్నారు. కార్మిక  హక్కులను హరించే ఈ లేబర్ కోడ్‌లకు వ్య తిరేకంగా విజయం సాధించేందుకు ఉద్యమించాల్సిందే అన్నారు. రైతు చట్టాలు వెన క్కి తీసుకునేవరకు ఉద్యమం జరిగినట్టే లేబ ర్ కోడ్‌లపై జరగాలని పిలుపునిచ్చారు. 

పోరు ఆగదు : రాంబాబు యాదవ్

లేబర్ కోడ్‌లపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన రౌండ్ లేబుల్ మీటింగ్‌కు రావడానికి అనేక సంఘాలు ఆసక్తి చూపాయని బీఆర్‌టీయూ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. కేవలం కొన్ని సంఘాలను మాత్రమే పిలిచామని, ఇకముందు కలిసి వచ్చే అన్ని సంఘాలను కలుపుకుని ముందుకుపోవాలని తీర్మానించినట్టు పేర్కొన్నారు. లేబర్ కోడ్‌లను కేంద్రం వెనక్కి తీసుకునే దాకా మా పోరాటం ఆగదని హెచ్చరించారు. 

అమ్మితే 30% కార్మికులకివ్వాలి: మాజీ మంత్రి మల్లారెడ్డి 

లేబర్ కోడ్‌లపై కార్మికులు పోరాటం చేసి విజయం సాధించాల ని మాజీ మంత్రి సీహె చ్ మల్లారెడ్డి తెలిపారు. అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర ఈ లేబర్ కోడ్‌లపై ధర్నా చేయాలన్నారు.  ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందు గోలీలకు కూడా దిక్కు లేదని, రేపు రాష్ర్టంలో అన్నీ బంద్ అయ్యే పరిస్థితి ఉందన్నారు. సినిమా టికెట్‌ల రేట్లు పెంచగా వచ్చి న మొత్తంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఈ మధ్యే సూచించారని, హిల్ట్ పాలసిలో పారిశ్రామిక వేత్తలు పొందుతున్న లబ్ధి లో 30 శాతం కార్మికులకు కేటాయి ంచాలని సీఎంఎందుకు చెప్పారు అని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు లాభం కలిగించి కార్మికులకు నష్టం కలిగిస్తే ఎట్లా అని నిలదీశారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి పది లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు. 

ఇండిగో సంక్షోభం..

మోనోపలీ (ఏకాధిపత్యం) వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందో, ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని, కేంద్ర ప్రభు త్వం పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌ లిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని తెలిపారు. శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగిందని, పైలట్లను దోపిడీ చే యొద్దని కేంద్రం గతేడాది చెప్పినా విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదన్నారు.

అందుకే ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపా రు. పైలట్ల విషయంలో ఏడాది క్రితమే డీజీసీఏ షరతులు విధించిందన్నారు. దేశంలోని విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదని పేర్కొన్నారు. సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండా లని, అది కూడా నాణ్యతతో ఉండాలని సూచించారు.