07-02-2026 12:05:19 AM
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు అన్ని జనరల్ స్థానాల్లో పోటీ చేసి కైవసం చేసుకోవాలి
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు
ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 31 రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే చూస్తూ ఉండాలా?, మెజారిటీ బీసీలకు 30 శాతం ఇచ్చి 10 శాతం ఉన్న ఓసీలకు 60 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా ? ఇది ముమ్మాటికి బీసీలను రాజకీయంగా అడ్డుకోవడమేనని బిసి పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్, ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు అన్నారు.
అందుకు అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు పోటీచేసి కైవసం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ మీడియాతో ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య, కో కన్వీనర్ లు ఎలికట్టే విజయకుమార్ గౌడ్, అయిలి వెంకన్న, అంబాల నారాయణ గౌడ్ లతో కలిసి వారు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు.
పార్లమెంట్‌లో రాజ్యంగా సవరణ ద్వారా 9 షెడ్యూల్ ప్రకారం బీసీ బిల్లు పెట్టాల్సిన అవసరం ఉండగా కనీసం ప్రైవేట్ బిల్లు కూడా పెట్టకుండా పోవడం వారి చిత్త శుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. తక్షణం పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు పెట్టాలని లేని పక్షంలో బీసీ లు అంత ఆయా పార్టీలకు రాజకీయంగా ఓటుతో తగిన బుద్ధి చెప్తామని అన్నారు. దేశంలో యూజీసీ బిల్లు లో ఎస్సీ, ఎస్టీ లతో సమానంగా బీసీ లకు కూడా న్యాయం జరగాల్సి ఉండగా అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు.
దేశంలో ఉన్న 70 కోట్ల ప్రజల సమస్యలు పార్లమెంట్ లో మాట్లాడకపోవడం, బీసీ లకు కేంద్రంలో ఒక్క మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడం 78 సంవత్సరాల పాలకుల వివక్ష అన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చవల్ ఫో రం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు. ఈ సమావేశంలో బైరు శేఖర్ గంగపుత్ర, సింగం నాగేష్ గౌడ్, నాగభూషణం, లింగేష్ యాద వ్, ఓయూ విద్యార్థి నాయకుడు రమేష్ యాదవ్, చెన్న శ్రీకాంత్ పాల్గొన్నారు.