14 మంది వైద్య సిబ్బందికి షోకాజ్
- గద్వాల కలెక్టర్ సంతోష్
గద్వాల (వనపర్తి), జూన్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వ ఏరియా దవాఖానలో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఏరియా దవాఖానను కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. రిజిస్టర్లు పరిశీలించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు 14 మందితో పాటు మరో నలుగురు వైద్య సిబ్బంది గైర్హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్టర్లు సరిగ్గా నిర్వహించకపోవడంతో ఫార్మాసిస్టును వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి, వైద్యాధికారులు ఉన్నారు.






