రాహిల్ బెయిల్ పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 2022, ఫిబ్రవరి 17 రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు నంబర్ 45 దగ్గర డివైడర్ దాటుతున్న వ్యక్తులను కేబుల్ బ్రిడ్జి మీదుగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి మరణించగా ముగ్గురు గాయపడ్డారు. కారులోని ముగ్గురు పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు 304ఏ, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. థార్ వాహనంపై నాటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉంది.
కారు తానే నడిపానంటూ ఆఫ్రాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో రాహిల్ అరెస్టయిన సందర్భంలో జూబ్లీహిల్స్ కేసులో కదలిక వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రమాద సమయంలో కారు నడిపింది రాహిలేనని, తెర మీదుకు ఆఫ్రాన్‌ను తెచ్చారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీంతో జూబ్లీహిల్స్ కేసులో తనకు ముం దస్తు బెయిల్ మంజూరు చేయాలని రాహిల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారించారు. పిటిషనర్‌కు ముందుస్తు బెయిల్ ఇస్తే తండ్రి రాజకీయ పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసుల తరఫున పీపీ వాదించారు. ఈ వాదనను ఆమోదించిన హైకో ర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.






