calender_icon.png 13 August, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రావణమాస బోనాలు

11-08-2025 12:00:00 AM

అశ్వాపురం, ఆగస్టు 10,(విజయ క్రాంతి):శ్రావణమాసం సందర్భంగా మండలంలోని సీతారామపురం, మొండికుంట, మల్లెలమడుగు, గొల్లగూడెం గ్రామ పంచాయితీలలోని ముత్యాలమ్మతల్లి దేవాలయాల్లో ఆదివారం బోనాల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలను మహిళలు తలపై ఎత్తుకుని ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు.

అనంతరం అమ్మవారికి బోనాల నైవేద్యాన్ని సమర్పించి, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పుష్కలంగా పండాలని మొక్కులు మోసారు. కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి చీరలు, సారెలు సమర్పించారు. డప్పుల మోత, శివసత్తుల గోషలతో గ్రామాల్లోని దేవాలయాలు కోలాహలంగా మారాయి.

ప్రతి ఏడాది గ్రామానికి కాపలా కాసే ఇంటి దేవత ముత్యాలమ్మ అమ్మవారికి శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఆతిథ్యం ఇస్తారో, అదే రీతిలో భక్తులు అమ్మవారికి ఆప్యాయతతో బోనాలు సమర్పించడం భక్తులసంప్రదాయం.