శ్రేయాస్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఆదుకున్న భారత సారథి
నిరాశపరిచిన వైభవ్
ఇంగ్లాండ్ టార్గెట్ 159
బ్రిస్టల్, జూలై 9: సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. కీలక బ్యాటర్లందరూ విఫలమవడం కొంపముంచింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆదుకోకుంటే టీమిండియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో రెండు మార్పులు చేశారు. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ కృష్ణలకు చోటు దక్కింది. భారీ అంచనాల మధ్య మరోసారి బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఈ సారి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒక సిక్సర్, బౌండరీ కొట్టి ఊపు మీద కనిపించిన సూర్యవంశీ(15) మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. రెండో టీ20 మాదిరే షార్ట్ పిచ్ డెలివరీకి వైభవ్ దొరికిపోయాడు. ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతికి భారీ షాట్ ఆడబోయి వైభవ్ ఔటయ్యాడు.షార్ట్ లెంగ్త్ బంతిని ’పుల్’ షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు.
కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేవగా మిడాన్‌లో సామ్ కుర్రాన్ సునాయస క్యాచ్ అందుకున్నాడు. వైభవ్ గత రెండు మ్యాచ్లలో 14, 13 స్కోర్లను నమోదు చేశాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ(16), ఇషాన్ కిషన్(4) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. ఇంగ్లండ్ బౌలర్లకు శ్రేయస్ చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శ్రేయస్, క్రీజులో సెటిల్ అయ్యాక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.
ఓ వైపు క్రమం తప్పకొండా వికెట్లు పడుతున్నా అయ్యర్ తన దూకుడును కొనసాగించాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(22) పర్వాలేదనిపించాడు. శ్రేయాస్ అయ్యర్ దూబేతో కలిసి 53 పరుగులు , తిలక్ వర్మతో కలిసి 29 పరుగులు జోడించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగుల స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, అదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్: 158/7 ( శ్రేయాస్ అయ్యర్ 80 నాటౌట్, దూబే 22 , అభిషేక్ శర్మ 16 , వైభవ్ సూర్యవంశీ 15, తిలక్ వర్మ 11 ; ఆర్చర్ 2/20, జోష్ టంగ్ 2/20, విల్ జాక్స్ 1/28, అదిల్ రషీద్ 1/49)






