కాగితాల్లోనే హెచ్‌సీఏ క్రికెట్: టీసీఏ
కోర్టునే తప్పుదోవ పట్టించేలా నివేదికలు
సీబీఐ దర్యాప్తుకు టీసీఏ డిమాండ్
హైదరాబాద్, జూలై 9: తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిందేమీ లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ విమర్శించింది. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించేలా హెచ్‌సీఏ వ్యవస్థీకృతంగా తప్పుడు గణాంకాలను రూపొందించి బాంబే హైకోర్టుకు సమర్పించిందని టీసీఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని టీసీఏ డిమాండ్ చేసింది.
హెచ్‌సీఏ తరఫున ప్రతినిధి ఆగంరావు సంతకంతో బాంబే హైకోర్టుకు సమర్పించిన జిల్లా క్రికెట్ కార్యకలాపాల నివేదిక ప్రతులను తాము సేకరించినట్లు టీసీఏ తెలిపింది. ఆ నివేదికలో తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో హెచ్‌సీఏ విస్తృతంగా క్రికెట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, అందులోని వివరాలు క్షేత్రస్థాయి వాస్తవాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఒకవేళ ఈ నివేదికలోని వివరాలన్నీ నిజమయితే, ఇంతవరకు మీడియా, జిల్లా క్రీడా సంఘాలు, జిల్లా పరిపాలన, స్థానిక ఆటగాళ్లు కూడా చూడని ఒక అద్భుతమైన క్రికెట్ విప్లవం తెలంగాణలో జరిగినట్లేనని టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి వ్యాఖ్యానించారు.
కానీ వాస్తవానికి గత ఎన్నో సంవత్సరాలుగా హెచ్‌సీఏ కార్యకలాపాలు ప్రధానంగా హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. అలాంటిది కోర్టు ముందు మాత్రం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా భారీ మౌలిక సదుపాయాలు, వందలాది మ్యాచ్‌లు, క్యాంపులు కనిపించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇన్నేళ్లుగా ఈ కార్యకలాపాలన్నీ ఎక్కడ జరిగాయని ప్రశ్నించారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ తదితర జిల్లాల్లో నిర్వహించినట్లు చూపిన టోర్నమెంట్లలో దాదాపు ఒకే సంఖ్యలో మ్యాచ్‌లు నమోదు చేశారనీ పేర్కొన్నారు.






