8 March, 2026 | 8:35 AM

సివిల్స్ సాధించిన సిబ్లింగ్స్

08-03-2026 01:48 AM
  1. సాప్ట్‌వేర్ టూ సివిల్ ర్యాంకర్స్ 

అత్యుత్తమ ఉద్యోగులుగా అన్నాదమ్ములు

నల్లగొండ, మార్చి 7 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి వెలిమినేటి అంజిరెడ్డి, అలివేలు దంపతులకు కూతురు, ఇద్దరు కుమారులు విక్రమ సింహరెడ్డి, విజయసింహారెడ్డిలు. పేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు సోదరులు తమ చివరి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్‌లో ర్యాంక్‌లు సాధించారు.

తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటూ అక్కడే తమ పిల్లల్ని 10వ తరగతి, ఇంటర్ వరకు హైదరాబాదులోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించారు. తదుపరి ఇద్దరు సోదరులలో ఒకరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి, మరొకరు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, సెన్సైస్ లో కంప్యూటర్ ఇన్ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి అయిన తదుపరి ఇద్దరు సోదరులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించి కొన్నాళ్లు ఉద్యోగం చేశారు.

తదుపరి ఎలాగైనా తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో లక్షల రూపాయల జీతం వచ్చే ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసారు. అయితే ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలంటే డబ్బు అవసరం రావడంతో ఓ ఎంసి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారి అక్క ఆదాయంమే ఆసరా అయింది. ఈ క్రమంలో 2021లో ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత తమ లక్ష్యాల మేరకు సవాలుతో కూడిన నిర్ణయం తీసుకున్నారు.

రోజుల తరబడి సమయం వృధా చేయకుండా కష్టపడి చదవడంతో గత గ్రూప్ వన్ ఫలితాలలో విక్రమసింహారెడ్డి 208వ ర్యాంకు సాధించి అసిస్టెంట్ ఎక్సుజ్ సూపరిండెంట్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. విజయసింహారెడ్డి 340 ర్యాంకు సాధించి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పట్టు వదలని విక్రమార్కులుగా చదువును కొనసాగిస్తూ సివిల్స్ రాశారు.

ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో విక్రమసింహారెడ్డి 541 ర్యాంక్ సాధించగా.. అన్న వెలిమినేటి విజయసింహరెడ్డి 682 ర్యాంక్ సాధించారు. ప్రతి వైఫల్యం తర్వాత తదుపరి ప్రయత్నంలో తమ ప్రదర్శన మెరుగుపరచుకున్నట్లు ఇద్దరు సోదరులు చెపుతుండటం గమనార్హం. రైతు కుటుంబంలో జన్మించిన తమకు గ్రామంలోని మూడు ఎకరాల భూమి నుండి వచ్చే ఆదాయంపైనే తమ జీవనం, విద్య ఆధారపడి ఉందని చెప్పారు.