సింధు జలాగ్ని!
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నిరుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హిమాలయాల్లో ప్రవహించే ఈ నది జలాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌పై అన్ని విధాలుగా ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన భారత్ గత కొంతకాలంగా ఆ దేశం పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్నది.
అందులో భాగంగానే సింధు జలాలకు అడ్డుకట్ట వేసే ప్రణాళికలను భారత్ వేగవంతం చేసింది. చిన్నచిన్న ఆనకట్టలు, కాలువల నిర్మాణం, నీటినిల్వ సామర్థ్యం పెంపు లాంటి భారత చర్యలతో పాకిస్థాన్‌లోని పంజాబ్ తదితర రాష్ట్రాల్లో నీటికి కటకట ఏర్పడింది. అయితే, దిగువన ఉన్న పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాక స్థితిలో కవ్వింపులకు దిగుతున్నది. కాగా, హిమాలయ ప్రాంతంలో ఉద్భవించిన సింధు, దాని ఆరు ఉపనదులు భారత్, పాక్ గుండా ప్రవహిస్తాయి.
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో ఇరుదేశాల మధ్య సింధు జలాల పంపిణీ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు వైపు ప్రవహించే నదులపై భారత్‌కు, పశ్చిమం వైపు ప్రవహించే నదులపై పాక్‌కు హక్కులు సంక్రమించాయి. అయితే విద్యుత్ ఉత్పత్తి, పరిమిత సాగునీటి అవసరాల నిమిత్తం పశ్చిమం వైపున్న నదులపైనా భారత్‌కు హక్కులు దక్కాయి. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఈ ఒప్పందంపై భారత్ అసంతృప్తిగా ఉంది.
ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత భూభాగంలో ప్రవహించే ప్రతి చుక్క నీటిని దేశ అవసరాలకు పూర్తిగా వినియోగించుకోవాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో బలపడింది. దీంతో పాక్‌లో కరువు ఛాయలు అలుముకొని పలు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో సింధు జలాలే తమ దేశ వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారమని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే, నీళ్ల కోసం అవసరమైతే యుద్ధానికి కూడా దిగుతామని పాక్ పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ క్రమంలో సింధు జలాల వివాదం రెండు దేశా ల మధ్య రాజకీయంగా, భద్రతా, దౌత్యపరంగా ప్రభావం చూపే స్థాయికి చేరింది. ఉగ్రదాడులు జరిగినా, సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగినా ఈ అంశం వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇది ఎటువైపునకు దారితీస్తుందో చూడాలి.






