1 July, 2026 | 1:02 AM

ప్రాంతీయ పార్టీల అస్తిత్వ పోరు

01-07-2026 12:00 AM

స్వాతంత్య్రం తర్వాత ఏకచ్ఛత్రాధిపత్యంగా అటు కేంద్రంలో, ఇటు వివిధ రాష్ట్రాల్లో పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ 1960 దశకం నుంచి తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో స్థానిక అంశాల ఆధారంగా ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతమే ధ్యేయంగా డీఎంకే, హిందుత్వ రక్షణ కోసం, మరాఠీల కోసం మహారాష్ట్రలో శివసేన, ఉత్తరప్రదేశ్‌లో బహుజనుల శ్రేయస్సే ధ్యేయం గా బీఎస్పీ, యువత, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఎస్పీ, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, జార్ఖండ్‌లో ఆదివాసీ హక్కుల కోసం జేఎంఎం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణలో బీఆర్‌ఎస్, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం, ఒడిశాలో బిజూ జనతాదళ్,  పశ్చిమ బంగాల్‌లో టీఎంసీ, అసోంలో అస్సాం గణ పరిషత్, కశ్మీర్‌లో పలు పార్టీలు, ఇటీవల అవినీతి నిర్మూలనే ప్రధాన అజెండాగా ఆప్ లాంటి పార్టీలు అయా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలను పక్కకునెట్టి ఒకానొక సమయంలో అధికారంలోకి వచ్చాయి. జాతీయ రాజకీయా లను, ఢిల్లీ పీఠాన్ని కూడా శాసించాయి.

అయితే 2014లో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రాం తీయ పార్టీలకు గడ్డు కాలం దాపురించింది. అనేక పార్టీలు అధికారం కోల్పో యి, కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాలను లోతుగా అధ్యయనం చేస్తే ప్రాంతీయ పార్టీల్లో ఉన్న అనేక లోపాలు బహిర్గతమవుతాయి. వారసత్వ రాజకీయాలు, కుటుంబ సభ్యుల ప్రమేయం, అవి నీతి, సీనియర్లును పక్కనపెట్టడం, ముఖ్యంగా యువతను విస్మరించడం, ఆధిపత్య ధోరణితో పాలించడం లాంటి కారణాలు దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల పతనానికి కారణమని చెప్పాలి.

మరీ ముఖ్యంగా జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఆర్థిక వనరుల కోసం కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడ టం ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ ధర్మపరిరక్షణ, అవినీతి రహిత పాలన, ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేయడం, డిజిటల్ సేవల విస్తరణ, జాతీయవాదం, దేశ భద్రత వంటి అంశాల కారణంగా ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తున్నారు.

ఇవి ఒక రకంగా ప్రాంతీయ పార్టీలకు మరణశాసనాన్ని రాశా యి. ఒకప్పుడు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించిన వామపక్ష పార్టీలు కూడా అన్ని రాష్ట్రాల్లో బలహీనపడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండే జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు కనపడుతున్నాయి. ఆశలు రేపిన మరో జాతీయ పార్టీ ఆప్ అవినీతి ఆరోపణలు, అంతర్గత అసంతృప్తి  వల్ల ప్రజలకు దూరమైంది. ఈ నేపథ్యంలో భవి ష్యత్తులో ‘ఒకే దేశం, ఒకే పార్టీ’ లక్ష్యంతో మోదీ- షా ద్వయం పనిచేస్తున్నది.

దీనికి అనుగుణంగానే శ్రేణులు కూడా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల లోపాలను, బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, అసంతృప్త నేతలను చేరదీస్తూ బీజేపీని బలోపేతం చేయడానికి ముమ్మర ప్రయ త్నాలు చేస్తున్నా రు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తమ లోపాలను సవరించుకోకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నది.

ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవ డం అత్యావశ్యకం. ప్రజాస్వామ్య దేశంలో బహుళ పార్టీల మనుగడ సాగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏక పార్టీ రాజ్యం వస్తుంది. దానివల్ల నియంతృత్వ, ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. ప్రశ్నించే హక్కును పాలకులు హరిస్తారు. చివరికి మన రాజ్యాంగ నిర్మాతలు, స్వాతంత్య్ర సమరయోధులు ఆశించిన ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుంది. అందుకే ఏ ఆశయాలు, లక్ష్యాల కోసం పార్టీలను ఏర్పాటు చేశారో ప్రాంతీయ పార్టీల అధినేతలు తెలుసుకోవాలి. వాటిని సాధించడానికి పనిచేయాలి. వార సత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి.

కష్టపడి పని చేసేవారికి కీలక బాధ్యతలు అప్పగించాలి. సామాజిక న్యాయాన్ని పాటించాలి. అధికార వికేంద్రీకరణ జరగాలి. అవినీతి, బంధుప్రీతికి చెక్ పెట్టాలి. యువత ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రాంతీ య పార్టీలు పనిచేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రాంతీయ పార్టీలు బతికి బట్టకడతాయని ఇప్పటికైనా గ్రహించాలి.

ఐ.ప్రసాదరావు

 వ్యాసకర్త సెల్: 6305682733