ఇ-వేస్ట్‌ను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయాలి
ఇల్లెందు, (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, కోల్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఇ-వేస్ట్ ప్రత్యేక డిస్పోజల్ కార్యక్రమాన్ని ఇల్లందు ఏరియాలో మంగళవారం నిర్వహించారు. ఇల్లందు ఏరియాలోని ఐటీ విభాగంలో ఎన్విరాన్‌మెంట్ అధికారి నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య(General Manager V. Krishnaiah) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాడైపోయిన మానిటర్లు, కీబోర్డులు, మౌస్‌లు, ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేశారు. ఈ సందర్భంగా జీఎం వి. కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇ-వేస్ట్‌ను సాధారణ వ్యర్థాలతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యాలయాలతో పాటు ఇళ్లలోనూ పనికిరాని పాత ఫోన్లు, కంప్యూటర్లు, వైర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా నిర్దేశిత విధానంలోనే డిస్పోజ్ చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం జాకీర్ హుస్సేన్, డీవైఎస్‌ఈ (సివిల్) వినయ్ సాగర్, ఎన్విరాన్‌మెంట్ అధికారి నరసింహారావు, ఐటీ అధికారి చైతన్యతో పాటు అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.