23-01-2026 12:00:00 AM
సినీ పరిశ్రమలో మరో విషాదం ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ గాయని ఎస్ జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) కన్నుమూశారు. గురువారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ ఆరోగ్యం ఇటీవల విషమించడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ మరణ వార్త సినీ, సంగీత రంగాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మురళీకృష్ణ మృతి విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్త తనను ఉలిక్కిపడేలా చేసిందంటూ ఆమె భావోద్వేగంతో పోస్టు పెట్టారు. ‘ఈ ఉదయం మురళీ అన్న ఆకస్మిక మరణవార్త విని నేను షాకయ్యాను. మేము ప్రేమగల సోదరుడిని కోల్పోయాం. ఈ భరించలేని బాధను, దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మ (జానకి)కు శక్తిని ప్రసాదించుగాక..’ అంటూ రాసుకొచ్చారు చిత్ర.
భరత నాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన మురళీకృష్ణ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. నటుడిగానూ పలు చిత్రాల్లో కనిపించారు. తెలుగులో ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి సినిమాల్లో నటించారు. మలయాళ చిత్రం ‘కూలింగ్ గ్లాస్’కు రచయితగా పనిచేశారు. పలువురు సినీ, సంగీత ప్రముఖులు మురళీకృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, జానకి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.