11 August, 2026 | 1:49 AM

ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి

11-08-2026 12:00 AM
  1. పారదర్శకతకు ప్రాధాన్యత
  2.  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఎస్ ఐ ఆర్ కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో విజయవంతమైనట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.

జిల్లాలోని జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 796 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 6,96,006 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల ముద్రణ, పంపిణీ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్రంగా నమోదు చేయడం ద్వారా ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం లో 2,06,343 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 90.27 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం లో 2,28,503 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందన్నారు. 90.17 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం లో 2,61,160 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందన్నారు.

83.96 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,96,006 మంది ఓటర్లు ఉండగా, అందరికీ ఎన్నికల ఫారాల ముద్రణ, పంపిణీ 100 శాతం పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 6,11,568 ఎన్నికల ఫారాలు, అంటే 87.87 శాతం డిజిటైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 796 మంది బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించిన శిక్షణను పూర్తిగా పొందారు. 84,438 ధృవీకరణ కాని ఎన్నికల ఫారాలు నమోదు చేసినట్లు తెలిపారు.