రఘునాథగూడెంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
కల్లూరు, ఆగస్టు 10 (విజయక్రాంతి): మండలంలోని రఘునాథగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ సైడ్ కాలువల శుభ్రపరిచే పనులను సోమవారం చేపట్టారు. గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జెసిపి సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, చెత్తాచెదారం లేకుండా శుభ్రపరిచారు. కాలువల్లో నిల్వ ఉండే మురుగు నీరు దిగువ ప్రాంతాలకు సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
ఈ చర్యల వల్ల వర్షాకాలంలో గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా,దోమలు పెరగకుండా,వ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రణ సాధ్యమవుతుందని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణలో ఇటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కీలకమని ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.అదేవిధంగా గ్రామంలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్ పొడి చల్లి శుభ్రతను పెంపొందించడంతో పాటు,దోమల బెడద తగ్గించేందుకు తరచూ ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ప్రతి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ కాకుండా చూసుకోవడం,చెత్తను నిర్దిష్ట ప్రదేశాల్లో వేయడం వంటి విషయాల్లో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.గ్రామంలో పరిశుభ్రత కోసం చేపడుతున్న చర్యలకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుక్క రాణా,కర్నాటి రామకృష్ణారెడ్డి,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండి జమలయ్య ప్రధాన కార్యదర్శి శీలం నర్సిరెడ్డి,ముళ్ళపాటి శ్రీను, గ్రామపంచాయతీ సిబ్బంది మల్లేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.






