calender_icon.png 3 November, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 రాష్ట్రాలు యూటీల్లో సర్

28-10-2025 12:00:00 AM

తొమ్మిది రాష్ట్రాలు.. మూడు కేంద్రపాలిత ప్రాంతాలు 

-రెండో దశ ప్రక్రియలో 51 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం 

-మంగళవారం నుంచే ఎన్యూమరేటర్లకు శిక్షణ

-నవంబర్ 4 నుంచి ప్రక్రియ షురూ.. డిసెంబర్ 4న పూర్తి 

-ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితా ప్రకటన 

-ఢిల్లీ మీడియా సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ 

ముఖ్యమైన తేదీలు

ఎన్యూమరేషన్ ప్రక్రియ: నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4

ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ: డిసెంబర్ 9

అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ: డిసెంబర్ 9 నుంచి జనవరి 8

అభ్యంతరాలపై విచారణ గడువు: జనవరి 31

తుది ఓటరు జాబితా ప్రకటన: ఫిబ్రవరి 7

రెండోదశ ‘సర్’ నిర్వహించే రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు

-రాష్ట్రాలు

-ఛత్తీస్‌గఢ్

-గోవా

-గుజరాత్

-కేరళ

-మధ్యప్రదేశ్

-రాజస్థాన్

-తమిళనాడు

-ఉత్తరప్రదేశ్

-పశ్చిమబెంగాల్

కేంద్రపాలిత ప్రాంతాలు

-పుదుచ్చేరి

-లక్షద్వీప్

-అండమాన్ నికోబార్

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: మొదటి దశలో బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విజయవంతమైన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మరో కీలక ప్రకటన చేసింది. రెండో దశలో 12 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)ల్లో సర్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ సోమవారం న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకే ఎన్నికల సంఘం సర్ చేపడుతున్నదని తెలిపారు.

బీహార్‌లో చేపట్టిన ప్రక్రియలో 7.5 కోట్ల మంది భాగస్వాములయ్యారని తెలిపారు. ఆ దశ విజయవంతమైన తర్వాత 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించామని వివరించారు. ఈ సమావేశాల్లో రెండో విడతగా దేశవ్యాప్తంగా12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  ప్రక్రియ చేపడతామని తెలిపారు. రెండో దశలో 51 కోట్లమంది ఓటర్లు భాగస్వాములు కానున్నారని స్పష్టం చేశారు. ప్రక్రియ నిర్వహణకు మంగళవారం నుంచే ఎన్యూమరేటర్లు, యంత్రాంగానికి శిక్షణ ప్రారంభమతుందని వివరించారు.

నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని, దీనికి సంబంధించి డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామని, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని తేల్చిచెప్పారు. 1951లో మొదటిసారి ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ చేపట్టిందని గుర్తుచేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎనిమిది సార్లు ప్రక్రియ చేపట్టామని వివరించారు. చివరిసారిగా 2002 04 మధ్య సర్ నిర్వహించామని తెలిపారు. 2002 నుంచి ఓటర్లెవరైనా మరణించి ఉంటే, వారి ఓట్లు ప్రక్రియలో తొలగిపోతాయని తెలిపారు. పౌరసత్వానికి ఆధార్ ఒక ధ్రువపత్రం కాదని, ప్రక్రియలో మాత్రం ఆధార్‌ను గుర్తింపుగా సమర్పించవచ్చని స్పష్టం చేశారు.

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన? 

మమత పాలనలో ఓటర్ల జాబితా సవరణ సాధ్యమేనా? 

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) జరిగేనా..? రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉంటున్న బంగ్లాదేశ్ వలసదారులు భారతదేశ పౌరులుగా, ఓటర్లుగా నమోదు కానున్నారా..? కేంద్ర ఎన్నికల కమిషన్ ‘సర్’ను బెంగాల్‌లో పూర్తిచేయగలుగుతుం దా..? రానున్న కొద్ది నెలల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎలా మారనున్నా యి..? అనే ప్రశ్నలు ఇప్పుడు పరిశీలకుల మదిలో మెదులుతున్నాయి. రానున్న కొ ద్ది నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ‘సర్’ను చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నది. అందులోభాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ను ప్రారంభించేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల సం ఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.

అయితే, సీఈసీ షెడ్యూల్ ప్రకటనకు కొద్ది గంటల ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పావులు కదిపింది. సోమవారం ఉదయమే బెంగాల్‌లోని 10 జిల్లాల మెజిస్ట్రేట్లతో కలిపి 64 మంది ఐఏఎస్ అధికారులను బదిలీచేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రక్రియ మొదలైతే, రాష్ట్ర ప్రభుత్వం ఇలా బదిలీ చేయడం సాధ్యం కాదు. అందుకే, ఈసీఐ విలేకరుల సమావేశానికి కొద్ది గంటల ముందుగానే మమతా బెనర్జీ తమ పని కానిచ్చారు. ఇలా బదిలీ చేయటం వల్ల మొత్తం 457 మంది సివిల్ సర్వెంట్లకు స్థానచలనం జరిగింది. ఇక్కడే అసలు కథ మొదలుకానుంది. దేశంలో చట్టవిరుద్ధంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. అధికార పత్రాల పోర్జరీతోనూ, తప్పుడు గుర్తింపు కార్డులతోనూ వారు భారత్‌లో కొనసాగుతున్నారు.

ఇటీవల చట్టవిరుద్ధంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించి, పలు రాష్ట్రాల నుంచి వారిని వెనక్కి పంపించడంపై కొద్ది వారాలుగా మమతా బెనర్జీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒడిషా, అస్సాం, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి బంగ్లాదేశీ ముస్లింలను వెనక్కి పంపడంపై ఆమె గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు జిల్లాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ‘సర్’ మొదలుపెడితే, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మారింది. ఇలా చట్టవిరుద్ధంగా బెంగాల్‌లో ఉంటున్నవారు 2016 లెక్కల ప్రకారం దాదాపు 5 మిలియన్ల మంది ఉంటారని అంచనా. ఈ సంఖ్య కాస్త ఎక్కువేనని, సమస్యను పెద్దదిగా చేసి మమతను ఇరుకున పెట్టేందుకే కొందరు చూస్తున్నారని అనేవారూ ఉన్నారు.

దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి చట్టవిరుద్ధంగా దేశంలోనే ఉంటున్నవారి సంఖ్య భారత ప్రభుత్వం వద్ద కూడా లేదు. దేశంలో ఇలా చట్టవిరుద్ధంగా ఉంటున్నవారు 10 మిలియన్లేనని, పశ్చిమ బెంగాల్‌లో వారి సంఖ్య 5.4 మిలియన్లు ఉంటుందని 1997లోని ఒక లెక్క. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాల వల్ల దేశంలో అర్థికపరమైన ఒత్తిడి పడటమే కాకుండా, వారి తీవ్రవాద కార్యకలాపాలు దేశభద్రతకే ముప్పుగా పరిణమించాయి. బెంగాల్ విభజన, తూర్పు బంగ్లాదేశ్ స్వాతంత్య్ర కాలం నుంచి నిరంతరాయంగా చట్టవిరుద్ధ వలసలు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారిని సమగ్ర ఓటర్ల జాబితా తయారీలో ఏరివేయడం సాధ్యమవుతుందా? అందుకు మమతా బెనర్జీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా? అంటే, అందుకు మమత సిద్ధంగా లేదనేది తాజాగా అధికార బదిలీలతో స్పష్టమవుతోంది.

రాష్ట్ర ఓటర్లలో 5 శాతం వరకు బోగస్ ఓట్లేనని ఇప్పటికే ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. త్రుణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ను అడ్డుకుంటే, అది శాంతిభద్రల సమస్యగా పరిణమించవచ్చు. వచ్చే సంవత్సరం మేలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా పరిస్థితి చేయిదాటినా ఆశ్చర్యంలేదు. ఆ పరిస్థితుల్లో వచ్చే ఫిబ్రవరిలోనే కేంద్రం, రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అప్పట్నుంచి 3 నెలల పాటు కేంద్ర పాలన పరిస్థితులను చక్కదిద్ది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చు. కేంద్ర ఎన్నికల కమిషన్ తలపెట్టిన ‘సర్’, బెంగాల్‌లో మరోసారి రాజకీయ తేనెతుట్టెను కదుపనున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.