పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. విశ్వాస ఘాతుకం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం సరికాదు
పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి: రేవంత్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని తెలిపారు. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప… ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది స్పష్టంగా తేలిపోయిందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిపోయిందని చెప్పారు. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని గొప్పగా ప్రకటించుకుంటున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది? అని ఆయన ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని పదే పదే ప్రకటించింది. ఫలితాలు వెల్లడైన 10 రోజులు కూడా గడవకముందే రూ.3కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమని రేవంత్ మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలకు తెలిసిపోయిందన్న ఆయన ఇది విశ్వాస ఘాతుకం అవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.






