15-10-2025 01:08:41 AM
కోల్‌కతా, అక్టోబర్ 14: పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, తాజాగా ఐదో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తన సొంత సోదరినే పట్టించింది. దుర్గాపూర్ మెడికల్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న వైద్య విద్యార్థిని (23) ఈనెల 10వ తేదీ రాత్రి 8:30 గంటలకు స్నాక్స్ తినేందుకు తన స్నేహితుడితో కలిసి మెడికల్ కళాశాల నుంచి బయటకు వెళ్లింది.
ఐదుగురు దుండగులు ఇది గమనించిన స్నేహితుడిపై దాడి చేసి ఆమెను అపహరించారు. తర్వాత ఓ అటవీప్రాంతంలో ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలి స్నేహితుడు కళాశాలయాజమాన్యానికి, ఆమె తల్లిదండ్రులకు సమాచారం చేరవేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడిని అతని సోదరినే పట్టించింది.
ఇలా పట్టుబడ్డాడు..
అంతకుముందు అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఐదో నిందితుడు సఫీక్‌కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గాపూర్‌లోని అందాల్ వంతెన కింద నాఫిక్ తలదాచుకుంటున్నాడని తెలుసుకున్న అతడి సోదరి రోజినా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఘటన జరిగిన రోజే బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తన స్నేహితుడిపై దాడి చేసి, దుండగులు తనను బలవంతంగా అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారని తెలిపింది. నిందితులు ఫోన్ లాక్కొని విసిరేశారని, పెద్దగా అరుస్తుండగా.. అలా అరిస్తే మరికొంతమందిని పిలిచి అత్యాచారం చేస్తామని బెదిరించారని పేర్కొన్నది.