సితారలో యువహోరు..

02-05-2024 12:05:00 AM

వరుసగా సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థల్లో  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి.  సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, బెల్లంకొండ గణేష్, వైష్ణవ్ తేజ్  వంటి యువ కథానాయకులతో, యువత మెచ్చే అంశాలతో సినిమాలు చేస్తున్న ఈ బ్యానర్ వాటి ద్వారా బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాలని నమోదు చేస్తుంది. తాజాగా సితార యాజమాన్యం మరో యువ హీరోతో సినిమా చేయనున్నట్టు తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో 30వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయన పుట్టిన రోజు (మే 1) సందర్భంగా నిర్మాణ సంస్థ ఈ ప్రకటన చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.  సినీ నేప థ్యం గల కుటుంబం నుండి  వచ్చిన ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. తర్వాత ‘సెల్ఫిష్’ అనే సినిమా సగంలోనే ఆగిపోగా, ఆశిష్ చైతన్య కలిసి నటించిన ‘లవ్ మీ  ఇఫ్ యు డేర్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆత్మతో ప్రేమయాణం నడపడం వంటి విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మే 25న తెరమీదికి రానుంది. అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాకి కీరవాణి, పీసీ శ్రీరామ్ వంటి అగ్ర సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం.