సుకుమార్ కుమార్తెకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం

02-05-2024 12:05:00 AM

ప్రఖ్యాత దర్శకుడు సుకుమార్ కుమార్తె, సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పుర్కస్కారానికి ఎంపికయ్యారు. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశ్యంగా పద్మావతి మల్లాది రూపొందించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. సుకృతి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. ప్రస్త్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో 8వ గ్రేడ్ అభ్యసిస్తున్న  సుకృతి, మంగళవారం ఢిల్లీలో జరిగిన పుర స్కారాల ప్రధానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలోనూ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఈ చిత్రం ప్రదర్శితమవ్వగా సుకృతి నటనకు ప్రశంసలు లభించటంతో పాటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్  ఫిల్మ్ ఇంటర్నేషనల్  ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ బాలనటిగా అవార్డు గెలుచుకున్నారు. 11వ నోయి డా ఇంటర్నేషనల్  ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం, న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరి బెస్ట్ ఫిల్మ్, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్ (జ్యూరీ)గా ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ఎంపికైంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.