మానవీయత వైపే ‘నా అడుగులు’
తెలుగు సాహితీ క్షేత్రంలో డాక్టర్ కొరుప్రోలు హరనాథ్ ఒక సుపరిచితమైన పేరు. ఈ కవి 50 ఏళ్లుగా సాహిత్యంతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. తన అక్షరాలతో సమాజాన్ని మేల్కొల్పుతున్నారు. భాగ్యనగరంతో హరనాథ్‌కు వీడదీయలేని అనుబంధం ఉంది. దశాబ్దాల నుంచి ‘హైదరాబాద్ పాత నగర కవుల వేదిక’ను విజయవంతంగా నడిపిస్తున్నారు. తద్వారా ఎందరో వర్ధమాన కవులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన కవిత్వంలో హైదరాబాద్ నగర జీవన సౌందర్యం అడుగడుగునా కనిపిస్తుంది. పాతబస్తీ గల్లీల్లోని అత్తరు సుగంధాలు గుబాళిస్తాయి. మానవత్వపు పరిమళాలు జాలువారుతాయి.
స్వచ్ఛమైన భావధారకు, సమతా మమతలు కురిపించే కవిత్వానికి హరనాథ్ కేరాఫ్‌గా నిలుస్తారు. తాజాగా వెలువడిన హరనాథ్ కవితా సంకలనం ‘నా అడుగుల వైపే’. ఈ సంకలనం సామాజిక అంశాల కవితల సమాహారంగా నిలుస్తున్నది. ‘నా కవిత’ అనే శీర్షికలో కవి కవిత్వం రాయడమంటే ఒక ప్రసవ వేదన అభివర్ణించారు. ‘ఈ చిన్న కవితను ప్రసవించడానికి నా కలం ఎన్ని పురిటినొప్పులు పడిందో మీకేం తెలుసు?’ అంటూ కవిత్వా సృష్టిలోని లోతును వివరించారు. తన కవిత సూర్యచంద్రులు ఉన్నంత కాలం చిరంజీవిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
‘రహదారి’ అనే కవితలో జీవితమే ఒక కవిత్వమని వ్యక్తీకరించారు. జీవితమనే దారిలో రాలిపడుతున్న నక్షత్రాలను సంచిలో వేసుకుని నడుస్తున్న ప్రతిసారి అవి కవిత్వాన్ని చెబుతాయని చమత్కరించారు. ‘కవిత్వం అంటే జీవితం కదా.. జీవితాన్ని సృజించినప్పుడల్లా నన్ను కవిత్వం ప్రశ్నిస్తుంది’ అన్న వాక్యాలు ఆలోచింపజేస్తాయి. మనిషిని ప్రేమించడమే కవిత్వ పరమార్థమని కవి ఉద్ఘాటించారు. ‘ఎలా మరువగలం?’ అనే కవితలో ప్రేమలోని మధురిమను, అనుబంధాల కలయికను అద్భుతంగా ఆవిష్కరించారు. ‘పది వసంతాల పరిపక్వ ప్రేమ రామాయణం మాది’ అంటూ తన గత స్మృతులను నెమరువేసుకున్నారు. పచ్చని ప్రకృతి మధ్య సాగిన ఆ ప్రయాణం ఒక అమరలోక యాత్రగా అభివర్ణించారు.
ఆ స్మృతులు తన గుండెలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని కవి పేర్కొన్నారు. ‘గుండెకి తగిలిన’ అనే కవితలో శారీరక గాయం కంటే, మానసిక గాయం చాలా ప్రమాదకరమని కవి ఆవేదన చెందారు. ‘నుదుటి మీద గాయం తేలిగ్గానే మానుతుంది.. గుండెకు తగిలిన గాయం మాత్రం అంత తేలిగ్గా మానదు’ అంటూ వాస్తవాలను చెప్పారు. నగరంలోని రోడ్ల దుస్థితిని, ఇతరుల అసమర్థత వల్ల కలిగే ఇబ్బందులను వితలో ప్రశ్నించారు. ఓదార్పు లేని సమాజం పట్ల కవి నిరసన వ్యక్తం చేశారు. ‘విశ్వగీతి’ అనే కవితలో జీవితంలో ఎదురయ్యే అనుభవాల సారమే అసలైన సంపద అంటూ విశ్లేషించారు.
‘నడిచివచ్చిన ప్రతిదారిలో నూ కోల్పోయిన కొంత జీవితం’ మిగిలిస్తుందని చెప్పారు. మనిషిగా నిలబడటానికి మానవత్వం అత్యవసరమని పిలుపునిచ్చారు. విశ్వగీతికి గొంతు కలపాలని పురాతన మిత్రుడిని కోరుతూ గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ‘సందేశం’ అనే కవితలో జ్ఞాపకాలు ఎప్పుడూ గుండెను తొలిచే ఉదయాల్లా ఉంటాయని వ్యక్తీకరించారు. ‘నేను రూసో వారసుణ్ణి.. వోల్టేర్ నా మిత్రుడు‘ అంటూ తన సిద్ధాంత బలాన్ని చాటుకున్నారు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా తన మార్గం మాత్రం శాంతి అని స్పష్టం చేశారు. విశ్వమానవుడిగా శాంతి కోసం ముందుకు నడవడమే తన కవితా సందేశమని చాటిచెప్పారు.
‘చంద్రకాంతివి’ అనే కవితలో స్త్రీమూర్తి సౌందర్యాన్ని, ఆత్మీయతను కవి ఈ కవితలో కీర్తించారు. ‘నీ నుదుటి బొట్టు చూడగానే కోటానుకోట్ల కాంతులు విరజిమ్మే సూర్యబింబం గుర్తుకొస్తుంది’ అంటూ చక్కని ఉపమానాలు వాడారు. తన జీవితాన్ని నడిపించే జ్యోతిగా తన ప్రియ సఖిని కొనియాడారు. ఆమె పాదస్పర్శ అరకులోయలో హాయిని ఇస్తుందని వర్ణించారు.
‘కీర్తి’ అనే కవితలో మనిషి విజయ శిఖరాలను అధిరోహిస్తున్నప్పుడు శత్రువులు ఉండటం సహజమని కవి సూచించారు. అడ్డంకులను ఎదుర్కొని తన గమ్యం చేరినవాడే అసలైన విజేత అని చెప్పారు. శత్రువుల ప్రయత్నాలను తట్టుకుని నిలబడాలనే ధైర్యాన్ని కవిత నూరిపోస్తుంది. ‘తిరగబడితే’ అనే కవితలో ప్రజాశక్తి ముందు చట్టాలు, శాసనాలు తలవంచక తప్పదని కవి హెచ్చరించారు.




