29 March, 2026 | 3:38 AM

పొంగులేటి రాజీనామా చేయాలి

29-03-2026 01:59 AM

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సహా.. అక్రమ మైనింగ్‌పై 

  1. అక్రమ మైనింగ్ దోపిడీపై హౌస్ కమిటీ వేయండి
  2. రూల్స్, పర్మిషన్లు లేకుండానే దర్జాగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ దందా
  3. నా ఆరోపణలు అసత్యమైతే ఉరి తీయండి
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తూ, అనుమతులు లేకుండానే దందాలు చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందినద ని, నైతిక బాధ్యతగా మంత్రి పొంగులేటి తన పదవికి రాజీనామా చేసి, విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశా రు. తాను చేస్తున్న ఆరోపణలు అసత్యమైతే తనను ఉరి తీయాలని హరీశ్ రావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీలో మైనింగ్ శాఖ పద్దులపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ దోపిడీ చేస్తోందంటూ ఆధారాలు, అధికారుల నోటీసులు సభ ముందుం చారు. ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే అక్రమ మైనింగ్ కుంభకోణంపై ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయా లని, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. హైదరాబాద్ నడిబొడ్డున, నగరాన్ని ఆనుకునే పెద్ద ఎత్తు న అక్రమ మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయని, కంచె చేను మేసిన విధంగా, రక్షకుడే భక్షకుడిగా మారితే ఏం జరుగుతుందో.. అలాంటి పరిస్థితే రాష్ట్రంలో దాపురించిందన్నారు.

ప్రభుత్వానికి నాన్-టాక్స్ రెవెన్యూ తెచ్చిపెట్టే అత్యంత కీలకమైన మైనింగ్ శాఖలో అధికారులు, ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా పని చేస్తే ఖజానాకు అంత డబ్బు వస్తుందని, ఆ నిధులతో అభివృద్ధి, సంక్షేమం చేపట్టవచ్చ న్నారు. జీవో 111 పరిధిలోనే నిబంధనలను ఉల్లంఘిస్తూ రూల్స్, పర్మిషన్లు లేకుండానే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ దర్జాగా దందాలు చేస్తుందని ఆరపించారు. శంషాబాద్ మండలం కోత్వాల్ గూడ గ్రామంలో (సర్వే నంబర్ 62, 63) ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదని, కానీ అక్కడ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లపైన యథేచ్ఛగా నడుపుతోందన్నారు.

ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 26 (స్టోన్ క్రషర్ రూల్స్ 2026) ప్రకారం, స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్‌ఈ, సీఎఫ్‌వో సర్టిఫికెట్లు తీసుకోవాలని, కానీ ఇందులో ఏ ఒక్క నిబంధన కూడా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పాటించలేదని మండిపడ్డారు. కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే అన్ని పర్మిషన్లు ఉండా లని, అవి లేవు కాబట్టే దొంగచాటుగా డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 

నా ఆరోపణలు అసత్యమైతే ఉరి తీయండి

2025 మే 21 రోజున మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్‌పై తనిఖీకి ఆదేశించారని, రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడు లు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారని హరీశ్‌రావు ప్రస్తావించారు. గత నెల 2న డిమాండ్ నోటీసు ఆదేశించినా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సం స్థ అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. మైనింగ్ చట్టం ప్రకారం.. ఎండీఎల్ లైసెన్స్ లేకుండా క్వారీ చేస్తే మొదటిసారి పదివేలు, రెండోసారి కూడా పట్టుబడితే 25 వేల జరిమానాతో పాటు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించాలన్నారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. ఇప్పటివరకు మీరు తీసుకున్న కఠిన చర్యలు ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తమ్ముడుకు చెందిన స్టోన్ క్రషర్‌లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి  రా త్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారని, మరి ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పార్టీ మంత్రులకు ఒక న్యాయం ఉంటుం దా? అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వల్ల మూసీ నది కాలుష్యానికి, గండిపేట్, హిమాయత్ సాగర్‌లో కాలుష్యానికి కార ణం అవుతుందని లిఖితపూర్వకంగా రాశారని, దీనికి సీఎం ఏం సమాధా నం చెపు తారని నిలదీశారు.

రాఘవ కన్ట్స్‌క్ష్రన్‌కు, మంత్రి పొంగులేటికి ఏం సంబంధం లేకుం టే గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై తాము ట్విట్టర్‌లో పెడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ‘నాపై మొరిగే కుక్కలను గొలుసు కట్టి ఎలా కట్టేయాలో మాకు బాగా తెలుసు‘ అని ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. సంబంధం లేకపోతే మీరెందుకు భుజాలు తడుముకున్నారని, మంత్రి పొంగులేటి తక్షణమే నైతికంగా రాజీనామా చేసి, విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు, ఆయన గతంలో మాతో కలిసి పని చేశారని, కానీ తప్పు జరిగినప్పు డు.. ఆ తప్పును ఆధారాలతో సహా బయటకు తీయడం, రాష్ట్ర ఖజా నాను కాపాడటం ప్రతిపక్షంగా మా బాధ్యత అని స్పష్టం చేశారు.

తాను అసత్య ఆరోపణలు చేస్తే ఉరి శిక్ష వేయాలని, లేకపోతే తెలంగాణ ఖజానాను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా మైనింగ్ పద్దుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ లోపల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ’రాఘవ కన్స్ట్రక్షన్స్ గురిం చి హరీశ్‌రావు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేశారు. రాఘవ కన్ట్స్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకొచ్చా రు.

ఈ సందర్భంగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట జరగడడంతో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, విజేయుడు, సంజయ్‌కుమార్, కేపీ వివే కానంద గంగుల కమలాకర్ స్పీకర్ పోడి యం వద్ద బైఠాయించారు. మైనింగ్ స్కాం వెనుక ఉన్న మంత్రి పొంగులేటిని బర్త్ఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

అప్పుడెందుకు హౌస్ కమిటీ వేయలేదు : మంత్రి వివేక్

ఒక్క కంపెనీపై ఆరోపణలు చేస్తూ హౌస్ కమిటీ వేయాలని హరీశ్‌రావు అడగడం సరికాదని, విచారణ జరిపి తామే చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో సాండ్ మాఫియాలో దళితులను కొట్టినప్పుడు ఎందుకు హౌస్ కమిటీ వేయలేదని ప్రశ్నించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ఇసుక దందా, మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్రమాల కట్టడికి పకడ్భందీ విధానాలను అమలు చేస్తున్నామని, కొత్త పాలసీ కూడా తీసుకొచ్చామని తెలిపారు. కొత్త పాలసీతో పర్మిట్, సివరేజ్ ఎక్కవ కలెక్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఇల్లీగల్ క్రషర్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

పొంగులేటిపై టార్గెట్: మంత్రి సీతక్క

కావాలనే మంత్రి పొంగులేటిని హరీశ్‌రావు టార్గెట్ చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 40 క్రషర్లకు పర్మిషన్ ఇచ్చారని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగా మంత్రుల పేర్లు తీస్తున్నారన్నారు. పదేళ్ల అక్రమాలపై విచారణ చేయాలని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పదేళ్లు జరిగిన మైనింగ్‌పై విచారణ జరిపిద్దామన్నారు. పదేళ్ల అడ్డగోలుగా ఇసుక దోపిడి చేశారని ఆరోపించారు. తప్పు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

అడ్డగోలు ఆరోపణలు సరికాదు: మంత్రి శ్రీధర్‌బాబు

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో మంత్రి పొంగులేటి డైరెక్టర్ కాదు, చైర్మన్ కాదని.. ఆ కంపెనీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా మాజీ మంత్రి హరీశ్‌రావు అడ్డగోలు ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. వారి కుటుంబ సభ్యులకు వ్యాపారం ఉంటే తప్పా అని ప్రశ్నిస్తూ.. ఆ కంపెనీ తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. హరీశ్‌రావు వెంటనే క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన మాటలు రికార్డ్ నుంచి తొలగించాలన్నారు. ఒకరిని టార్గెట్ చేస్తూ... వ్యక్తిగత విమర్శలు చేయడం సభా సాంప్రదాయం కాదని హితవు పలికారు. హరీశ్‌రావు దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు అలా అని అభూత కల్పనలతో అందర్నీ తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో మైనింగ్ డిపార్ట్‌మెంట్ బాగా పనిచేసినట్టు... ఇప్పుడు చేయడం లేదంటూ తప్పుడు ప్రచారం సరికాదని, మీరు సలహాలు ఇస్తే స్వీకరించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. విచారణకు సిద్ధం అని ప్రభుత్వం తరఫున మంత్రి వివేక్ వెంకట స్వామి చెప్పినా హౌజ్ కమిటీ వేయాలంటూ బీఆర్‌ఎస్ సభ్యులు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. హౌజ్ కమిటీ వేయడం సాధ్యం కాదని తెలిసినా కావాలనే బీఆర్‌ఎస్ సభ్యులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.