29 March, 2026 | 11:59 AM

రోహిత్ వేముల దళితుడు కాదు!

04-05-2024 12:51 AM

కేసు క్లోజ్.. అన్న పోలీసులు l కాదు తదుపరి విచారణ జరిపిస్తామన్న డీజీపీ

హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల ఆందోళన

హైదరాబాద్, మే 3, (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాదని తేలిందని, ఈ నేప థ్యంలో ఆతని ఆత్మహత్య ఘటనపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కింది కోర్టులో మెమో దాఖలు చేసిన కారణంగా పిటిషన్‌పై విచారణ అవసరం లేదని హైకోర్టు  తేల్చింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి  సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేయాలంటూ హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ పొదిలె అప్పారావు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణ అవసరం లేదని చెప్పి దానిని కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు.

రోహిత్ వేముల కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రోహిత్ తల్లి రాధిక అనుమానాలు వ్యక్తంచేశారు. దీనితో ఈ కేసుపై తదుపరి విచారణ చేయాలని రాష్ట్ర  డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. కేసులో న్యాయం చేయాలని నేడు సీఎం రేవంత్‌రెడ్డిని రోహిత్ తల్లి కలుసుకోనున్నారు. ఏడేండ్ల క్రితం సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్య తర్వాత పెద్దఎత్తున ఆందోళన జరిగింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారుల విచారణలో రోహిత్ వేముల వడ్డెర కులానికి చెందినవాడని (బీసీ అని తేల్చారు.

పీహెచ్‌డీ చేస్తున్న రోహిత్ వేముల దళితుడంటూ అతని ఆత్మహత్య తర్వాత ఆందోళనలు జరిగాయి  పోలీసులు కింది కోర్టులో దాఖలు చేసిన మెమోలో వర్సిటీలో జరిగిన ఒక ఘటన నేపథ్యంలో రోహిత్ మరో నలుగురు విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. కలత చెందిన రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య ఘటనపై గచ్చిబౌలి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ తర్వాత కింది కోర్టులో మెమోలో తగిన సాక్ష్యాధారాలు లేవని, కేసును మూసేయాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో మాజీ వీసీ అప్పారావు కోరుతున్న ఉపశమనం మనుగడలో లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

హెచ్‌సీయూ విద్యార్థి సంఘాల ఆందోళన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడేండ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఎస్సీ కాదని పోలీసులు నివేదిక ఇవ్వడంపై హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఆ నివేదిక సరికాదని, పారద ర్శకంగా దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. శుక్రవారం హెచ్‌సీ యూలో ఏబీవీపీ మినహా విద్యార్థి సం ఘాలన్నీ ఐక్యంగా నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, ఏడేండ్ల తర్వాత ఎన్నికల సమయంలో రోహిత్ వేముల కులం ఎస్సీ కాదనడంపై అభ్యంతరం తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లు బయటపడుతా యనే ఉద్దేశంతో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని నివేదిక ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఫేక్ సర్టిఫికెట్లపై చదువుకోవాల్సిన అవసరం రోహిత్‌కు లేదని, ఆయన మెరిట్ విద్యార్థి అని చెప్పా రు. రోహిత్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ గత ంలో స్పందించా రని, విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపారని గుర్తుచేశారు. రోహిత్‌ది ముమ్మాటికీ ఇన్ స్టిట్యూషనల్ మర్డరే అని ఆరోపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న బీజేపీ నాయలు బండా రు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నాటి వీసీ అప్పారావు, పలువురు ఏబీవీపీ నాయకులకు రోహిత్ చనిపోవడానికి సంబంధం లేదనడం దారుణమని అన్నారు. 

* రాష్ట్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలి

రోహిత్ ఎస్సీ కాదని పోలీసులు నివేదిక ఇవ్వడం దారుణం. ఈ కేసు లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి. రోహిత్‌కు న్యాయం చేయాలి.

 నాగరాజు, 

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి

* కాంగ్రెస్ హామీ నిలబెట్టుకోవాలి

రోహిత్ వేముల కేసులో న్యాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలి. కేసును నిష్పక్షపాతంగా మొదటి నుంచి తిరిగి దర్యాప్తు చేయాలి. దోషులను శిక్షించాలి.

   మణికంఠరెడ్డి, 

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

* పునర్విచారణ చేపట్టాలి

సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ కమిటీలు రోహిత్ ఎస్సీ అని తేల్చాయి. పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టులు కేసు మూసేయడంతో అన్యాయం జరుగింది. పునర్విచారణ చేపట్టాలి. 

 పీడీఎస్‌యూ, రాష్ట్ర అధ్యక్షుడు