8 June, 2026 | 5:39 PM

ఆరు నెలల వేతనాలు విడుదల చేయాలి

08-06-2026 04:33 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా (ఎంఎల్‌హెచ్‌పీ) పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు చిరంజీవి మాట్లాడుతూ.. 2025 నవంబర్ 12 నుంచి కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మోడీ, దేవాపూర్ సబ్‌సెంటర్లలో, అలాగే అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిర్రకుంట, గుండి సబ్‌సెంటర్లలో ఎంఎల్‌హెచ్‌పీలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు నిరంతరాయంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.

గర్భిణీల పర్యవేక్షణ, బాలింతల సంరక్షణ, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు సహా పలు వైద్య సేవలను అంకితభావంతో నిర్వహిస్తున్నప్పటికీ ఆరు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. వేతనాలు లేకపోయినా ప్రజా సేవలకు ఆటంకం కలగకుండా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు.ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు ఆరోగ్య సిబ్బందిపై మానవతా దృక్పథంతో స్పందించి పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు రవీనా, ప్రత్యూష, స్నేహ, అనూష తదితరులు పాల్గొన్నారు.