6 పదుల్లో..ఈ పరీక్షలు తప్పనిసరి!
29-06-2025 12:00 AM
సాధారణంగా మధ్యవయసుకు చేరాక చేయించుకునే పరీక్షలతో పాటు వయసు 60 దాటాక ఆరోగ్యపరంగా కొన్ని ప్రత్యేక పరీక్షలతో పాటు అదనంగా చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
డయాబెటిస్, గుండె జబ్బుల నిర్ధారణ, లిపిడ్ ప్రొఫైల్, టీఎమ్‌టీ పరీక్ష, యాంజియోగ్రామ్, హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు, క్యాన్సర్, కంటి పరీక్షలు సహజంగా చేయించుకుంటాం. కానీ వాటితో పాటు అదనంగా ఈ పరీక్షలు కూడా చేయించుకోవాలి అంటున్నారు నిపుణులు.
బీపీ స్క్రీనింగ్
ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్ చెయించుకోవడం అవసరం. ఒకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయించాలి.
కొలెస్ట్రాల్ స్క్రీనింగ్
50 దాటాక ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించి, అది నార్మల్ కనుక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొలెస్ట్రాల్ స్థాయిలు తెలుసుకుంటూ ఉండటం మంచిది. గుండెకు సంబంధించిన ఈసీజీ, టూ డి ఎకో, టీఎమ్‌టీ, అవసరాన్ని బట్టి యాంజియోగ్రామ్ లేదా సీటీ యాంజియో వంటి పరీక్షలు చేయించుకోవాలి.
వ్యాక్సిన్లు
65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ వ్యాక్సీన్లు తీసుకుని ఉండకపోతే ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. ప్రతి ఏడాది ఫ్లూ వ్యాధి నుంచి రక్షణ కోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. ప్రతి పదేళ్లకోసారి టెటనస్‌ెేడిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి.
65 ఏళ్లు దాటాక టీహాడాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా సాధారణంగా చేయించుకునే పరీక్షలైన బరువు చెక్ చేసుకోవడం.. బాత్‌రూమ్‌లో లేదా ఇతర కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఉల్లాసంగా, ఆహ్లాదంగా లేకపోతే డిప్రెషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటివి ఎవరికి వారు చేసుకునే పరీక్షలూ.
డయాబెటిస్
చక్కెర వ్యాధి గురించి తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి.
పేగు క్యాన్సర్ పరీక్షలు
పెద్ద వయసులో పెద్ద పేగు క్యాన్సర్ లేదని తెలుసుకుని నిశ్చింతంగా ఉండటం కోసం.. ఏడాదిలో ఒకసారి మల పరీక్షతో పాటు ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్ అక్కల్ట్ టెస్ట్ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభైదాటిన నాటి ప్రతి పదేళ్లకోసారి చేయించుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు
6 పదుల్లో హాయిగా జీవించాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాలి. పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే.. ఆరోగ్యంగా.. ఉల్లాసంగా, హాయిగా జీవిస్తారు.






