1 August, 2026 | 9:40 AM

చర్మం ఒలిచి, ముక్కలుగా నరికి.. పసుపులో ఊరబెట్టి బంగ్లా ఎంపీ దారుణ హత్య

25-05-2024 12:28 AM

బంగ్లా నుంచి వచ్చి చంపి వెల్లిపోయిన హంతకులు

వలపువల వేసి ఎంపీ కిడ్నాప్! 

దర్యాప్తులో విస్తుపోయే అంశాలు

కోల్‌కతా, మే 24: బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో ప్రపంచమే నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కిరాయి హంతకులు ఎంపీని వలపువల వేసి  అపహరించి, దారుణంగా చంపటమే కాకుండా.. పోలీసులకు ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు మృతదేహం పై చర్మం మొత్తం ఒలిచి మాంసాన్ని, ఎముకలను చిన్నచిన్న ముక్కలుగా కోసి వాసన రాకుండా, త్వరగా కుళ్లిపోకుండా పసుపులో ఊరబెట్టారని బెంగాల్ సీఐడీ, బంగ్లాదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో తేలింది. 

4 కోట్ల టాకాల సుపారీ

అన్వరుల్ అనార్ ఖుల్నా డివిజన్‌లోని ఝెనైదాహ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఝెనైదాహ్ మున్సిపాలిటీ మేయర్ సోదరుడు ఎండీ అక్తరుజ్జమాన్‌తో ఆయనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరగటంతో అనార్‌ను చంపేందుకు అక్తరుజ్జమాన్ బంగ్లాదేశ్ కరెన్సీలో ౪ కోట్ల టాకాలు సుపారీ ఇచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. సుపారీ తీసుకొన్న కిరాయి హంతకులు భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డారు. ఈ నెల 12 వైద్యం కోసం అనార్ కోల్‌కతా వచ్చారు. బారానగర్‌లో ఉండే  తన మిత్రడైన గోపాల్ బిశ్వాస్ ఇంట్లోనే ఉన్నారు.

ఎంపీ కదలికలను క్షుణ్ణంగా గమనించిన హంత కులు  ముందుగానే నియమించిన ఓ యువతిని రంగంలోకి దింపి ట్రాప్‌లో పడేశారు.  న్యూటౌన్‌లోని ఓ ఫ్లాట్‌కు రప్పించి హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు చర్మం మొత్తం ఒలిచి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ఎముకలను కూడా చిన్నచిన్న భాగాలుగా నరికారు. అనంతరం వాటిని అక్కడినుంచి తరలించేవరకు కుళ్లిపోకుండా ఉండేందుకు పసుపు రాసి ప్లాస్టిక్ బ్యాగుల్లో జాగ్రత్తగా ప్యాక్ చేశారు.

వాటిని ఓ పెద్ద సూట్‌కేసులో పెట్టి అపార్ట్‌మెంట్ నుంచి తీసు కెళ్లి పోయారు. చినార్ పార్కులోని ఓ హోటళ్లో హత్యకు ఒకరోజు దిగిన హంతకులు, ఎంత సైలెంట్‌గా వచ్చారో అంతే సైలెంట్‌గా ఈ నెల 17న దేశం దాటి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. హంత కులు సూట్‌కేస్‌ను తీసుకెళ్తున్న వీడియో దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 

యువతి అరెస్టు

ఎంపీ అన్వరుల్‌ను హంతకులకు పట్టించిందని అనుమానిస్తున్న ఓ యువతని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అక్తరుజ్జమాన్ ప్రేయసి అయిన శిలాంతి రహమాన్ అనే యువతిని ఢాకాలో అరెస్టు చేసినట్టు ఆ దేశ పోలీసులు ప్రకటించారు. ఈమెనే అన్వరుల్‌ను బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రప్పించేందుకు వలపువల వేసినట్టు అనుమానిస్తున్నారు.