ఈసీని మేం ఆదేశించలేం
ఏడీఆర్ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, మే 24: సార్వత్రిక ఎన్నికల వేళ బూత్‌ల వారీగా డేటాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటింగ్ సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రా లవారీగా అందుబాటులో ఉంచేలా ఈసీని ఆదేంశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఈ ప్రక్రియ కోసం ఈసీ భారీస్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుం దని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ అభిప్రాయపడింది.
ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని తెలిపింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ విషయం లో సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి దశలో పోలింగ్ పూర్తయిన 48 గంటల్లో బూత్‌ల వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ అందుబాటులో ఉంచాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) సుప్రీంకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని మే 17న ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే.






