calender_icon.png 12 February, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ రైట్ రైట్!

12-02-2026 02:10:13 AM

పట్టాలెక్కనున్న శ్రీశైలం సొరంగమార్గం పనులు

2027 డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని లక్ష్యం

  1. అనుగుణంగా 24 గంటలూ పనిచేసే విధంగా ఆదేశాలు
  2. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు
  3. ప్రాజెక్టు పూర్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  4. అధికారులతో మంత్రి ఉత్తమ్ వరుస సమీక్షలు
  5. ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన హెలీ బోర్న్ సర్వే రిపోర్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టుగా భావిస్తున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్ బీసీ) టన్నెల్ పనులు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన ప్రమాదంతో నిలిచిపోయిన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనాలు పూర్తి చేసి, ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రాజెక్ట్‌ను 2027 డిసెం బర్ 9లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అధికార యంత్రాంగం 24 గంటల పని విధానానికి మారింది. 

టన్నెల్ తవ్వకాల్లో మార్పులు..

2025 ఫిబ్రవరిలో నల్లమల అటవీ ప్రాం తంలో టన్నెల్‌లో భాగం కుప్పకూలిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన ఈ ప్రమాదం తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. భూగర్భ జలాల ప్రవాహం, సిల్ట్ కద లికలు, రాయి నిర్మాణ అస్థిరత వంటి కారణా లు వెలుగులోకి రావడంతో ప్రాజెక్ట్‌పై సమగ్ర జియోలాజికల్ అధ్యయనాలు చేపట్టారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ జీఆర్‌ఐ) ఆధ్వర్యంలో భూగర్భ పరిస్థితులపై సర్వేలు పూర్తయ్యాయి.

ఈ నివేదికల ఆధారం గా టన్నెల్ తవ్వకాల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. గతంలో ఉపయోగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్(టీబీఎం) స్థానంలో డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని అనుసరించే దిశగా సాంకేతిక ప్రణాళిక రూపొందించారు. ప్రమాదాల నివారణకు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు, అదనపు సపోర్ట్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ పనుల స్థితిని సమీక్షించే విధంగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆలస్యం లేదా నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్థాయిలో హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. సుమారు 44 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ పూర్తయితే నల్లగొండ, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది. అనేక గ్రామాలకు తాగునీటి సరఫరా కూడా మెరుగుపడనుంది.

మొత్తం వ్యయం సుమారు రూ.4,000 కోట్లకు పైగానే ఉండగా, ఇప్పటికే గణనీయమైన భాగం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. భూగర్భ పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో సాంకేతిక జాగ్ర త్తలు తప్పనిసరి అవుతున్నాయి. ఒకవైపు సురక్షిత నిర్మాణం, మరోవైపు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి అధి కార యంత్రాంగంపై ఉంది. 2027 డెడ్‌లైన్ సాధ్యమవుతుందా అన్నది రాబోయే నెలల్లో పనుల వేగంపై ఆధారపడి ఉంటుంది. మొ త్తానికి, ప్రమాదంతో ఆగిపోయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఇప్పుడు శాస్త్రీయ మార్గద ర్శకాలతో మళ్లీ ముందుకు కదులుతోంది. 

వరుస సమీక్షలు.. కఠినమైన డెడ్‌లైన్లు

నత్తనడకన సాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రాజెక్ట్ పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిపై కఠినమై న ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో టన్నెల్, లైనింగ్, ఎలక్ట్రోమెకానికల్ పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఆలస్యం జరిగిన భాగాలను గుర్తించి, వాటికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి వారం పురోగతి నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి స్పష్ట మైన రూట్ మ్యాప్ రూపొందించినట్లు సమాచారం. మిగిలిన సివిల్ పనులు, టన్నెల్ బ్రేక్ థ్రూ, సపోర్ట్ స్ట్రక్చర్ల బలోపేతం, పంపిం గ్ సిస్టమ్ అమలు వంటి దశలను టైమ్‌లైన్‌తో విభజించారు. ప్రతి దశకు బాధ్యతలను ఖరారు చేసి, ప్రత్యేక ఇంజినీరింగ్ టీమ్‌లను నియమించారు. టన్నెల్ పనుల్లో గతంలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సేఫ్టీ ఆడిట్లు, జియోటెక్నికల్ మానిటరింగ్, రియల్ టైమ్ సెన్సార్ సిస్టమ్ అమలు వంటి అంశాలను వేగవంతం చేస్తున్నారు. కార్మికుల భద్రతకు అవసరమైన ఏ ర్పాట్లు ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రభుత్వానికి హెలిబోర్న్ సర్వే రిపోర్టు

ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి నిర్వహించిన హెలి బోర్న్ సర్వే రిపోర్టు తాజాగా ప్రభుత్వానికి చేరింది. భూగర్భ నిర్మాణ పరిస్థితులు, భూమి స్వభావం, భౌగోళిక సవాళ్లపై ఈ రిపోర్టులో కీలక సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా సాంకేతిక మార్పులు, అదనపు బలోపేత చర్యలు తీసుకునే అవకాశముంది. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముండటంతో రైతుల్లో ఆశలు పెరిగాయి.

ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఇది జీవనాడిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేస్తే నీటి కొరతకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ మళ్లీ గాడిలో పడుతుందా? నిర్ణయించిన గడువుల్లో పూర్తి అవుతుందా? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.