calender_icon.png 8 October, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి మద్దతు ధర కోసం స్లాట్ బుకింగ్ తప్పనిసరి

08-10-2025 12:48:32 AM

ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మల్లేశం

సంగారెడ్డి, అక్టోబర్ 7 :పత్తి రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సీసీఐకి పత్తి విక్రయించాలంటే కపాస్ కిసాన్ యాప్ లో తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఈ.మల్లేశం తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కపాస్ కిసాన్ యాప్ ఫై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రియాజ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ పత్తి రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సీసీఐకి పత్తి విక్రయించాలంటే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకుని సిసిఐ కేంద్రానికి పత్తిని తీసుకెళ్లాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం కొత్త కపాస్ కిసాన్ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలు నాణ్యమైన పత్తికి రూ. 8110 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు.

పత్తి కొనుగోలులో దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించడంలో కపాస్ కిసాన్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సిబ్బంది, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.