08-10-2025 12:47:09 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,అక్టోబర్ 7(విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు కేటాయించబడిన అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మ్యాన్ పవర్, బ్యాలెట్ బాక్సెస్, రవాణా, శిక్షణ, సామాగ్రి నిర్వహణ, ఖర్చుల పరిశీలన, పరిశీలకులు, బ్యాలెట్ పేపర్ -పోస్టల్ బ్యాలెట్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్ లైన్, ఫిర్యాదులు-పరిష్కారాలు, ఓటర్ స్లిప్పుల పంపిణీ, నివేదికలు, వెబ్ కాస్టింగ్, ఫలితాల పర్యవేక్షణ అంశాలకు సంబంధించి నోడల్ అధికారులను నియమించామని తెలిపారు.
ఈ విధులు కేటాయించబడిన అధికారులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎలాంటి పొరపాట్లకూ తావు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్ర భుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని, అటువంటి వారిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇప్పటికే శిక్షణలో పూర్తి చేసామని, ఎన్నికల నిర్వహణకు బ్యా లెట్ బాక్స్ ల కొరత లేదని తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేలా సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, అధికారులుపాల్గొన్నారు.