నత్త నడకన యాష్ పాండ్ పనులు
భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 7వ దశ పుల్లాయిగూడెం యాష్‌పాండ్ 2 పరిధిలో టీఎస్ జెన్కో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నది. పాండ్ చుట్టుకొలత సుమారు మూడు కిలోమీటర్లు కాగా, చుట్టూ 5 మీటర్ల మేర కట్ట నిర్మించేందుకు టీఎస్ జెన్కో టెండర్లు ఆహ్వానించింది. 13శాతం తక్కువకు టెండర్ వేసి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన కావేరి కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ పనులు ప్రారంభించింది. అక్టోబర్ నాటికి పనులు కావాల్సి ఉండగా ఇప్పటికీ కేవలం 20శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
పాండ్ ప్రాముఖ్యత ఇదీ..
కేటీపీఎస్ కర్మాగారంలో బొగ్గు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే క్రమంలో వెలువడిన బూడిదను పైప్‌లైన్ ద్వారా యాష్‌పాండ్‌కు తరలిస్తారు. కర్మాగారం నుంచి రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం యాష్ పాండ్ పూర్తిగా నిండిపోయింది. ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన బూడిదను తప్పనిసరిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీఎస్ జెన్కో యాష్ పాండ్ కట్ట ఎత్తు పెంచాలని నిర్ణయించి పనులు చేపట్టింది. కాగా, పనులు నత్తకు నడక నేర్పేలా జరుగుతున్నాయి.






