పోలీసు శాఖలో పోస్టింగ్‌ల పైరవీలు!
జగిత్యాల, మే 29 (విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న అధికారులలో కొందరికి స్థానభ్రంశం తప్పదన్న సంకేతాలు రావడంతో సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్‌లు వెతుక్కునే పనిలో పడినట్లు తెలుస్తోంది.
మరికొందరు ఉన్న స్థానంలోనే మరో ఏడాదికాలం కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. వీరి ఆరాటంతో పార్లమెంట్ ఎన్నికలు ఆ శాఖలో ఎక్కడ చూసినా బదిలీల గురించే చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లాలో ఎస్పీ, జగిత్యాల, మెట్ పల్లి రెండు డిఎస్పీ కార్యాలయాలు, ఆరు సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలకు స్థానభ్రంశం తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అయితే డీఎస్సీ, ఓ సీఐ హైదరాబాద్ వెళ్లేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు.. పొరుగు జిల్లాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే తమకు అనుకూలమైన ఏరియాల్లో పోస్టింగ్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుతంలో అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఇక్కడికి వచ్చిన వారు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణల నేపధ్యంలోవారికి స్థానభ్రంశం తప్పదని తెలుస్తోంది. దీంతో పలువురు పోలీసులు అధికారులు ముందుగానే కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు మొత్తం అయిపోయే వరకు ఓపిక పట్టాలని లీడర్లు దాటవేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు ముగియగానే సదరు అధికారుల బదిలీల వ్యవహారం మళీ తెరపైకి వచ్చింది.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కొందరు పోలీసులు కాంగ్రెస్ నేతలపై కన్నెర్ర చేశారనే విమరలు ఉన్నాయి. ఇదే అదునుగా ఇక్కడ పోస్టింగ్ ల కోసం కాచుకొని కూర్చున్న వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ల్యాండ్, సాండ్ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా దారి తప్పింది. కొందరు ఎస్‌ఐ, సీఐలు ప్రతీ కేసులో కాసులు రాల్చుకోవడంపైనే దృష్టి సారిస్తున్నట్లు పలువురు బాధితులు చెబుతున్నారు. ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ గా ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన వారే ఇక్కడ అందరితో ఉన్న సత్సంబంధాలతో సంపాదించుకునేందుకు ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
జగిత్యాల జిల్లాలో పోస్టింగ్ లకు భలే డిమాండ్ కనిపిస్తోంది. ల్యాండ్, సాండ్ వ్యవహారం అటు నాయకులకు, ఇటు పోలీసులకు బంగారు బాతులా మారిందని చెప్ప వచ్చు. వచ్చేనెల 4వ తేదీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బదిలీలు జరుగనున్నాయనే స్పష్టత రావడంతో పోలీస్ అధికారులు పోస్టింగ్ ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.






