ఉపాధి హామీ పనులపై కూలీల మధ్య సోషల్ ఆడిట్
చివ్వెంల,(విజయక్రాంతి): మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులపై సోమవారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. డిఅర్‌పి (DRP) ఏ. ప్రభాకర్ స్వయంగా పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి, కూలీలతో నేరుగా మాట్లాడి పనుల అమలు తీరును సమీక్షించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి కనీస సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా మస్టర్ రోల్స్‌ను పరిశీలించి కూలీల హాజరు నమోదు సక్రమంగా జరుగుతున్నదా అని తనిఖీ చేశారు. అలాగే డిమాండ్ నమోదు, జాబ్ కార్డుల అప్డేట్ అంశాలపై కూడా సమీక్షించారు. కూలీలు చేయాల్సిన పనులు, వారికి లభించే వేతనాలు, పనుల ప్రమాణాలు వంటి విషయాలను వివరంగా తెలియజేశారు. కూలీలు తమ సమస్యలను అధికారికి తెలియజేసి పరిష్కారం కోరగా, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






