10 July, 2026 | 2:08 AM

ఇంటర్నెట్‌తో జీవితాలు ఆగం

10-07-2026 12:00 AM

అనంతమైన అంతర్జాలంలో నేడు సోషల్ మీడియా వేదికల జోరు కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్‌లో అనవసర ముచ్చట్లకు సోషల్ మీడియా అడ్డాగా మారింది. అంతర్గత విషయాలను సైతం అనాలోచిత సమాజం బహిర్గతం చేస్తున్నది. ఈ క్రమంలో నేటి తరం ఇంటర్నెట్‌తో సహజీవనం చేస్తున్నది. అవసరానికి మించి వాడితే దానివల్ల జీవితం వ్యర్థమవుతుంది. మంచి విషయాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఓ నేస్తం కావాలి.

హద్దులు చెరిపేస్తున్న అంతర్జాలం నేడు మానవ సంబంధాల పాలిట క్రూర మృగం కాకుండా ప్రతి ఒక్కరం వినియోగించుకోవాలి. అపరిచిత వ్యక్తుల పరిచయాల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం. రీల్స్ మాయాజాలం మత్తులో మునిగిపోకూడదు. మాయమాటల వలలో చిక్కి కాలాన్ని సాగనంపకూడదు. వీక్షకుల కోసం వ్యక్తిత్వ విలువలను దిగదార్చుకోవడం సరికాదు. అది మన జీవితానికి ఏదో ఒక రోజు పెనుముప్పుగా మారుతుంది. అలా చేయడం వల్ల జీవితంలో అంధకారం తప్ప ఏమీ మిగలదని గుర్తించుకోవాలి. ఆగంతకుల సావాసాన్ని స్వాగతిస్తే, అదే కుటుంబ అనుబంధాల మధ్య చిచ్చుకు కారణం అవుతుంది.

కనీవినీ ఎరగని వింతైన రంగుల ప్రపంచమే ఈ సోషల్ మీడియా. అది తెలుసుకోలేక ఎంతోమంది తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అనుమానస్పద వ్యక్తుల స్నేహాన్ని ఆదిలోనే నిలువరించాలి. లేదంటే బతు కు రోడ్డుపాలు కావడం తథ్యం. అంతర్జాలం అనంతమైన ఊహల లోకం. అందులో ఓ బాటసారిగా ఉండాలి తప్ప బలిపశువు కాకూడదు. తీయని మాటల పలకరింపుల పెంట నమ్మించే నయవంచకులు ఉంటారు. అబ్బురపరిచే అందాల ఫొటోలు జీవితాన్ని అల్లరి పాలుచేసే వికృత రూపాలని గుర్తుంచుకోవాలి.

సోషల్ మీడియా కారణంగా కుటుంబ సభ్యుల మధ్య నమ్మకాలు వమ్ము అవుతున్నాయి. ముఖ్యంగా ఆలుమగల మధ్య ఇది చిచ్చుపెడుతున్నది. అంతేకాదు, చాలామంది చిన్న వయసులోనే సోషల్‌మీడియా ప్రభావానికి లోనై తనువు చాలిస్తున్నారు. అంతుచిక్కని సోషల్ మీడియాలో అమాయక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో హనీట్రాప్‌ల కారణంగా యువకులు బలవుతున్నారు. చివరికి పరువు పోగొట్టుకొ ని ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు అనేకం. మరోవైపు బెట్టింగ్ యాప్‌లకు యువత బలవుతున్నది.

వారి కుటుంబాల ఆర్తనాదాలు పెడుతున్నాయి. విపరీతమైన మానసిక ఒత్తిళ్లకు గురై యువత నాశనమవుతున్నది. ఇవన్నీ సోషల్ మీడియా తాలూకా ఘోరాలే. రెండువైపులా పదునైన కత్తి లాంటి సోషల్ మీడియాను మంచి కోసం మాత్రమే వినియోగించాలి. మంచి విషయాలను మాత్రమే అందులో వెతికితే, అది మన అవసరానికి ఆసరాగా మారడం ఖాయం. అదుపుతప్పిన ఆలోచనలు వెంటపడితే అది మనల్ని పాతాళానికి తొక్కడం తథ్యం.

 వంశీకృష్ణ గౌడ్ బండి, 8688063096