10 July, 2026 | 2:06 AM

ఎడతెగని పోరు!

10-07-2026 12:00 AM

అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగిసిందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇరుదేశాలు మళ్లీ కయ్యానికి కాలుదువ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల ఇరుపక్షా లు అరవై రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం విదితమే.

ఆ సమయంలో పలు కీలక అంశాలపై పరస్పర అవగాహన కుదిరినట్టు వార్తలు వచ్చినా, పూర్తిస్థాయి శాంతి స్థాపన దిశగా అడుగులు పడకపోవడం శోచనీయం. తాజా ఘర్షణల ప్రభావం ప్రధానంగా గల్ఫ్ దేశాలపై పడింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు ఆయా దేశాలు సంసిద్ధమవుతున్న తరుణంలోనే మరోసారి దాడులు జరిగాయి. ఇటు అమెరికా, అటు ఇరాన్ భీకర దాడులకు దిగడంతో గల్ఫ్ దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అందుకే ఖతార్, ఒమన్ వంటి దేశాలు మరోసారి శాంతి చర్చల కోసం రంగంలోకి దిగాయి.

కాగా, పరస్పర విశ్వాసం లోపించడమే శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పర్యవేక్షణ కోసం అమెరికా పట్టుబట్టగా, ముందుగా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. సముద్ర మార్గాల్లో భద్రత, మిత్రదేశాల రక్షణ, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీ తదితర అంశాల్లోనూ విభేదాలు తలెత్తినట్టు విశ్లేషణలు వినవస్తున్నాయి. అయితే, ఈ చర్చలు విఫలం కావడానికి ఏదో ఒక పక్షాన్ని పూర్తిగా బాధ్యులను చేయడం సరికాదు. అమెరికా తన ఒత్తిడి విధానాన్ని కొనసాగించగా, ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై తనకున్న వ్యూహాత్మక పట్టును కోల్పోవడానికి సిద్ధపడలేదని చెప్పాలి.

కాగా, ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగనప్పటికీ, ఆ దేశం క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోసారి పూర్తిస్థాయి యుద్ధం జరిగితే ఇరుపక్షాలకు భారీ నష్టం తప్పదు. చివరికి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు గతానుభవం చెబుతున్నది. ఇందుకోసం ముందుగా ఇరుపక్షాల మధ్య పరస్పర విశ్వాసం ఏర్పడాలి. తొలుత అణు కార్యక్రమంపై స్పష్టమైన ఒప్పందం జరగాలి. ఆర్థిక ఆంక్షల సడలింపులు, సముద్ర మార్గాల భద్రతపై ఏకాభిప్రాయం కుదరాలి. ఈ పోరు పశ్చిమాసియా స్థిరత్వానికే పెద్ద సవాలుగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా శాశ్వత శాంతి దిశగా వేగంగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది.