మట్టి పరీక్షలు మంచికే!
జయశంకర్ భూపాలపల్లి, మే 29(విజయక్రాంతి): విత్తనం ఎంత ఖరీదు పెట్టి కొన్నాం.. ఎంత మంచి ఎరువులు వేశామన్నది ముఖ్యం కాదు.. అసలు విత్తనాలు వేసే నేల స్వభావం ఎలాంటిది? అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. దానికి అనుగుణంగా ఆ నేలలో ఏ పంట పండిస్తే లాభం చేకూరుతుందో తెలుసుకోవడం రైతు ప్రధాన కర్తవ్యం. అందుకు వ్యవసాయ శాఖ అధికారులు మట్టి పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారిని సంప్రదిస్తే అన్ని వివరాలు అందజేసి సరైన సలహాలు అందిస్తారు.
మట్టి పరీక్షలు ఎందుకు?
పంట ఎదుగుదల నేల స్వభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేలలో సహజంగా ఉండే పోషక పదార్థాలను గుర్తించేందుకు మట్టి పరీక్షలు దోహదపడుతాయి. వాటి ఫలితాల ఆధారంగా ఆ నేలలో ఏ రకమైన పంటలు వేయాలో తెలుసుకోవచ్చు. మట్టి సారాన్ని బట్టి పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలు చేయించి సంరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో రైతులకు అందుబాటులో ఉండేలా మినీ మొబైల్ పరీక్షా కేంద్రాలు సైతం ఉన్నాయి. రైతులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే కేంద్రానికి తమ పంట పొలాల్లోని మట్టిని అందిస్తే వారు టెస్ట్ చేసి వివరాలు అందిస్తారు. .
భూసార పరీక్షలతో అనేక లాభాలు
వ్యవసాయ భూముల్లోని మట్టిలో పోషక పదార్థాల స్థాయిని భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. నేల భౌతిక, రసాయన స్థితిని బట్టి ఆ భూములు ఏ పంటకు ఏ ఎరువులు ఎంత మోతాదులో ఏ రూపంలో వాడాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎరువులపై అదనపు ఖర్చులు తగ్గించుకోవచ్చు.
సేకరణ విధానం..
ఎలాంటి చెత్త, కలుపు లేని ప్రాంతంలోనే మట్టి నమూనా సేకరించారు. వీ ఆకారంలో 7 నుంచి 8అంగుళాల లోతు దాకా గొయ్యి తవ్వాలి. ఒక ఎకరం స్థలంలో ఎనిమిది నుం చి పది చోట్ల ఉప నమూనాలు సేకరించాలి. సేకరించిన ఉప నమూనాలను శుభ్రమైన డబ్బాలోకి చేర్చి బాగా కలపాలి. ఆరబెట్టిన తర్వాత చదును చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. మూలాలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకోవాలి. అరకిలో మట్టిని నమూనా వచ్చేదాకా చేయాలి.అలా సేకరించిన మట్టిని భూసార పరీక్షా కేంద్రంలో అప్పగించాలి. వాటిని పరీక్షించి, ఆ భూముల్లో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రీయ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్ మూలకాల స్థాయిని నిర్ధారిస్తారు.
జాగ్రత్తలు అవసరమే...
ఎరువులు వేసిన వెంటనే మట్టి నమూనాలను సేకరించవద్దు. చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల వద్ద మట్టి పరీక్షలకు పనికిరాదు. కంపోస్ట్, పశువుల ఎరువుల కుప్పల కింద మట్టి సేకరించవద్దు. మట్టి నమూనా తీసుకు వచ్చేటప్పుడు నేల పైభాగంలో చెత్త చెదారం తొలగించాలి. తేమ తక్కువ ఉన్న చోట మట్టి సేకరించడం మంచి కాదు.
ఎండాకాలం దుక్కులు మేలు
రైతులు వేసవిలో అడపాదడపా కురిసిన వర్షాలకు దుక్కులు దున్నుకోవాలి. దీంతో వేసవి దుక్కులు వానాకాలం సాగుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. నీటి సదుపా యం ఉన్న చోట రైతులు వర్షాల కోసం ఎదురుచూడకుండా భూమిని నీటితో తడిపి దుక్కులు సిద్ధం చేసుకోవాలి. పంట కోత కోయగానే నేలలో ఉన్న పదనుతో కూడా దున్నుకోవచ్చు.ఇలా చేయడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. నేలలో తేమ శాతం కూడా పెరుగుతుంది. దుక్కి దున్నడం వల్ల నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వేసవి దుక్కుల వల్ల భూమిలోపల కలుపు మొక్కల ఆనవాళ్లు ఉంటే పైభాగానికి వచ్చి ఎండలకు పూర్తిగా మాడిపోయే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా కలుపు మొక్కల బెడద తగ్గే అవకాశం కలుగుతుంది. మొత్తం వేసవి దుక్కులు రైతులకు మేలు చేస్తాయంటున్నారు వ్యవసాయవేత్తలు.






