29 July, 2026 | 3:02 AM

భార్యాపిల్లల్ని భర్తే చంపాడా?

30-05-2024 12:22 AM

ఖమ్మం, మే 29 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాలో మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో గృహిణితో పాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ వాహనం నడుపుతున్న భర్త బోడా ప్రవీణ్‌కు స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడడం, కారు లోపల ఉన్న భార్య కుమారి (25), పిల్లలు కృషిక (5), కృతిక (3)కు ఎలాంటి గాయాలు కాకుండానే మృత్యువాతపడడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కుమారి తల్లిదండ్రులు కూడా అల్లు డు ప్రవీణే తమ కుమార్తెతోపాటు ఇద్దరు పిల్లలను చంపి, రోడ్డుప్రమాదంలో చిత్రీకరిస్తున్నా డని బుధవారం ఖమ్మంలోని ప్రధానాసుపత్రి మార్చురీ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రవీ ణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం నెరపుతూ భార్యాపిల్లల హత్యకు పథకం రచించాడని, దీనిలో భాగంగానే రోడ్డు ప్రమాదం కథ అల్లుతున్నాడని మండిపడ్డారు.

కానీ ప్రవీణ్ మాత్రం రహదారిపైకి వచ్చిన కుక్కను తప్పించబోతున్న క్రమంలో కారు చెట్టును ఢీకొట్టిందని చెప్తున్నాడు. మరోవైపు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి, సీఐ శ్రీహరి విచారణను వేగవంతం చేశారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడికావాల్సి ఉన్నది.

జరిగింది ఇదీ..

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాంనగర్ తండాకు చెందిన కుమారి (25) కి ఐదేండ్ల క్రితం రఘునాథపాలెం మండలం బావోజీతండాకు చెందిన ప్రవీణ్‌తో వివాహమైంది. వీరికి కుమార్తెలు కృషిక(4), కృతిక (3). ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. పిల్లల ఆధార్ అప్‌డేట్ చేయించేందుకు మంగళవారం వారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లారు. యంత్రం మంచుకొండ మీదుగా బావోజితండాకు కారులో వస్తుండగా అనుమానాస్పద స్థితిలో కుమారి, కృషిక, కృతిక మృతిచెందారు. ప్రవీణ్‌కు మాత్రం స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలంలో చెట్టును ఢీకొన్న కారును గుర్తించారు.