29 July, 2026 | 1:17 AM

పదేళ్లలో రైతులకు బీఆర్‌ఎస్ ఏం చేసింది?

30-05-2024 12:30 AM

ఆదిలాబాద్, మే 29 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీఛార్జి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఆ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హితవుపలికారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలని కేటీఆర్‌ని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు.

రైతులను నమ్మించి మోసం చేసి జైలుకు పంపింది, రైతులకు ఎరువులను అందజేస్తామని మోసం చేసింది బీఆర్‌ఎస్సే అని మండిపడ్డారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని చెప్పారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని స్పష్టంచేశారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.