19 April, 2026 | 2:35 AM

కరీంనగర్ ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చండి

01-04-2025 01:29 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, మార్చి 31 (విజయ క్రాంతి): రాబోవు మూడు నెలల్లో కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నందున  పరిష్కారం చూపాలని మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్  డిమాండ్ చేశారు.

సోమవారం ఎల్‌ఎండి లోని నీటిమట్టాన్ని పరిశీలించి, అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ ఎం డి ద్వారా కరీంనగర్ నగరానికి త్రాగునీటి సరఫరాతో పాటు, దిగువ ప్రాంతమైన సూర్యాపేట వరకు త్రాగునీరు సాగునీరు అందిస్తుందన్నారని తెలిపారు. కరీంనగర్ చుట్టుపక్కల గల 12 లక్షల మందికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటినందిస్తుందని తెలిపారు. అయితే గత సమైక్య పాలనలో  2012 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు నీటి సమస్యలపై యుద్ధాలు జరిగేవని, అందులో భాగంగా ఎల్ ఎం డి నుండి దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేయడాన్ని  తానే స్వయంగా అడ్డుకొని ఇసుక బస్తాలు వేసిన సంఘటనను గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  10 సంవత్సరాల పాలన కాలంలో  ఏనాడు నీటి కోసం ఏ నాయకులు కూడ నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు లేవన్నారు. 10 సంవత్సరాల పాటు  ఎల్ ఎం డి. నిండుకుండగా ఉంచేందుకు  కెసిఆర్ ప్రభుత్వం  జీవో నెంబర్ 885 ను  అక్టోబర్ 30 వ తారీఖు 2017వ సంవత్సరంలో విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ద్వారా ఎల్‌ఎండిలో ఎప్పుడు 13 టీఎంసీల నీరు నిలువ ఉండేవిధంగా  చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో  ప్రతిరోజు నీటి సరఫరా చేసామని తెలిపారు, 

ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ లో  సుమారు 5.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని  గత పది సంవత్సరాల కాలంలో ఏనాడు ఈనెల 31 వ తారీకున ఇంత తక్కువగా నీటిమట్టాన్ని చూడలేదన్నారు.  ఎల్ ఎం డి లో ఉన్న నీటిని కిందికి తరలించడం తప్ప ఎగువ ప్రాంతంలో గల మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్ ఆర్ ఎస్ పి నుండి ఎల్ ఎం డి కినీటిని తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5.7 టిఎంసి నీళ్లలో  2.5 నీళ్లు డెడ్ స్టోరేజ్ గా  ఉంటుందని... మిగతా 3.2 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉంటాయని  ఈ నీటి ద్వారా  ఏప్రిల్ మే జూన్ మాసాలలో  కరీంనగర్ ప్రజలకు త్రా గునీటిని అందించడం సాధ్యం కాదన్నారు. 

కనీసం త్రాగునీరు అయిన అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, వాల రమణారావు, మేచినేని అశోక్ రావు, బోనాల శ్రీకాంత్, ఐలేందర్ యాదవ్, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, దుర్షేడు మాజీ ఉపసర్పంచ్ సుంకిసాల సంపత్ రావు, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు నారదాసు వసంతరావు, వొద్నాల రాజు, గడ్డం ప్రశాంత్ రెడ్డి, చల్లోజు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.