ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
- జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలి
సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చిన కోదండరాం
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజీవో, టీఎన్జీవో ఉద్యోగుల సంఘం నేతలు కలిసి గరువారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎస్ దృష్టికి వారు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ డీఏ, హెల్త్ కార్డులు, 317 జీవో సమస్య, సీపీఎస్ రద్దుతోపాటు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల మంజూరు, నూతన జిల్లాలకు అదనపు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు నాంపల్లిలో ని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు కోదండరాం, చిన్నారెడ్డిని టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారా యణతోపాటు నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్ సమావేశమయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.






