15 July, 2026 | 9:20 PM

సన్న బియ్యం ప్రభుత్వానికే ఇవ్వాలి

07-06-2024 02:54 AM

నిల్వల వివరాలు రెండు రోజల్లో తెలియజేయాలి

మిల్లర్లతో పౌరసరఫరాలశాఖ సమావేశం 

2.20 లక్షల టన్నుల సేకరణకు అధికారులు ప్రయత్నాలు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): సన్నబియ్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది 2.2 లక్షల టన్నుల సన్నబియ్యం కొనేందుకు మిల్లర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. తమ వద్ద  ఉన్న సన్నవడ్ల నిల్వలు పూర్తిగా ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించారు. గతంలో వ్యవహరించిన విధంగా ఇతర రాష్ట్రాలకు అమ్మకాలు చేయవద్దని, రెండు రోజు ల్లో స్టాక్ వివరాలను జిల్లా అధికారులు తెలియజేయాలని సూచించారు.

వీటిని మధ్యాహ్న భోజనం, అంగ న్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.  ఏటా రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా సన్న ధాన్యం సేకరించి సీఎంఆర్ చేయించి బియ్యాన్ని సరఫరా చేస్తుంది. గతేడాది సన్నా లు తక్కువగా సేకరించడంతో అవసరమైన బియ్యం కొనుగోలుకు మార్చి తొలి వారంలో టెండర్లు పిలిచింది.

కానీ టెండర్లలో అవినీతిలో జరిగిందని దుమారం లేవడంతో టెండర్ల ప్రక్రియను సర్కారు నిలిపివేసింది. దీంతో వీటిని మిల్లర్ల నుంచే సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతినెలా సంక్షేమ విద్యాసంస్థలు, హాస్టళ్లకు 18,500 టన్నులు, మధ్యాహ్న భోజన పథకానికి 6 వేల టన్నులు, ఐసీడీఎస్‌లకు 2,500 టన్నులు మొత్తం 10 నెలలకు 22 వేల టన్నుల బియ్యం కావాలి. త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతుండటంతో ముందుస్తుగా సన్నబియ్యం పంపీణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

46 లక్షల టన్నుల వడ్లు సేకరణ 

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించారు. వీటి విలువ రూ.10.20 కోట్లు ఉంటుంది. రాష్ట్రంలో 7,178 కోనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి 8,20,096 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం దాదాపు నిలిచిపోయింది. అత్యది కంగా నిజామాబాద్ జిల్లాలో 4.27 లక్షల టన్నులు, జగిత్యాలలో 4.17 లక్షల టన్నులు, కామారెడ్డిలో 3.15లక్షల టన్నులు, నల్లగొండలో 3.07 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 

గత సంవత్సరంలో దాన్యంసేకరణ పొలిస్తే తక్కువగా సేకరణ జరిగింది. ప్రభుత్వ టార్గెట్ 75 లక్షల టన్నులు ఉండగా, ఈసారి అశించిన స్థాయిలో ధాన్యం లభించలేదు. చాలామంది రైతులు ప్రైవేటు వ్యాపారులకే అమ్మారు. వ్యాపారులు కూడా రెండు మూడు రోజుల్లో నగదు ఇవ్వడంతో పాటు తమ పొలం దగ్గరికి వచ్చి తూకం వేసి తీసుకపోవడం రవాణా చార్జీల భారం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వానికి కావాల్సిన వడ్లు దొరకలేదు.