17-01-2026 04:15:42 AM
2015లో మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా పరిచయమైన సాయిపల్లవి 2017లో ‘ఫిదా’ సినిమాతో తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. తర్వాత తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. అలా ఇప్పటివరకు అన్ని ఇండస్ట్రీల్లో ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఈ దక్షిణాది బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. భారీ బడ్జెట్‌తో రానున్న ‘రామాయణ’లో సీతగా కనిపించనుంది సాయిపల్లవి. నితీశ్ తివారి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రణ్‌వీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా కన్నా ముందే సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న మరో బాలీవుడ్ సినిమా రానుంది. ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి సాయిపల్లవి నటిస్తున్న ఆ చిత్రమే ‘ఏక్ దిన్’.
సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథ చిత్రంలో సాయిపల్లవి మీరా పాత్రలో నటిస్తోంది. వచ్చే వేసవి కానుకగా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ‘కొన్ని ప్రేమకథలకు కాలంతో పనిలేదు’, ‘సినిమాల్లో జరిగినట్లు నిజ జీవితంలో ఎందుకు జరగవు’ అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలావుండగా ఈ సినిమా పోస్టర్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ పోస్టర్ 2016లో వచ్చిన థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ను పోలి ఉందని, మూవీని కాపీ చేశారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. టైటిల్ నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా ‘వన్ డే’కు రీమేక్‌గా రానుందా.. లేదా? అనే విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.