17-01-2026 04:17:10 AM
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోందీ చిత్రం. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “సితార బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి చిత్రాలను అందించారు.
అలాంటి సంస్థ నుంచి ఇటీవల ఒకట్రెండు సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో ‘అనగనగా ఒక రాజు’ రూపంలో ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్‌ను అందించడం మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. కథానాయకుడిగా నాకిది కేవలం నాలుగో సినిమా. నా తొలి సంక్రాంతి సినిమా. పోటీలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మా సినిమాని బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని! నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే.
ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను” అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఆరేళ్ల తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. సంక్రాంతి సమయంలో సినిమా విడుదల చేసి హిట్ కొట్టడం నాకు ప్రత్యేకమైనది. ఈ విజయంలో తన పూర్తి మద్దతు ఇచ్చిన నవీన్, మీనాక్షిలకు ధన్యవాదాలు.
త్రివిక్రమ్ ముందే ఈ సినిమా చూసి, బాగుందని చెప్పారు. ఆయన స్టాంప్ పడటం నాకెంతో ధైర్యాన్నిచ్చింది” అన్నారు. ‘ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. టీమ్‌లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే ఇది సాధ్యమైంది’ అని కథానాయిక మీనాక్షి చౌదరి చెప్పారు. ‘ఒక సినిమా అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చడం అనేది ప్రత్యేకం. ఇది మా టీమ్ అందరికీ మరిచిపోలేని సంక్రాంతి’ అని దర్శకుడు మారి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రచయిత్రి, క్రియేటర్ డైరెక్టర్ చిన్మయి, కెమెరామెన్ యువరాజు, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ, నటులు రావు రమేశ్, చంద్ర తదితర చిత్రబృందం పాల్గొని మాట్లాడారు.