16 August, 2026 | 11:29 PM

ఐదు నెలలకే చేదెక్కిన సర్కార్

24-05-2024 01:54 AM

యాదాద్రి భువనగిరి, మే 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అప్పుడే వ్యతిరేకత మొదలైందని, బీఆర్‌ఎస్ పాలనపై విసుగుపుట్టేందుకు పదేండ్లు పడితే.. రేవంత్ సర్కారు అయిదు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. బీబీనగర్ మండలం రాఘవాపురం, రుద్రవెల్లి  గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. వడ్లు ఎప్పుడు తీసుకొచ్చారు..? సెంటర్ నిర్వాహకులు ఏమంటున్నారు..? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..? అనే అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు. అనంతరం కిషన్‌జీ   విలేకరులతో మాట్లాడారు. 

45రోజులుగా రైతులు నరకం..!

 ఎంతో శ్రమకోర్చి పండించిన పంటను అమ్ముకోవడానికి 45 రోజులుగా రాష్ట్రంలో రైతులు నరకం అనుభవిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని, అసలు కొనుగోళ్లపై ప్రభుత్వఅజమాయిషీ, పర్యవేక్షణ లేనే లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కొనుగోలు చేసే ప్రతి ధాన్యం గింజకు కేంద్ర ప్రభుత్వమే నిధులు చెల్లిస్తోందని,  కనీస మద్దతు ధర, గోనె సంచులు, సుత్లీదారం, హమాలీతో పాటు కేంద్రాల నిర్వాహకులకు, సివిల్ సప్లయి శాఖకు కమీషన్ వరకు కేంద్రమే భరిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంపై ఒక్కపైసా భారం పడకున్నా.. సజావుగా ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్రానికి కలుగుతున్న నొప్పి ఏమిటనీ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను సందర్శించకపోవడం రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోందని ఆవేదన చెందారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల సమస్యల కంటే ఎన్నికలే ముఖ్యమయ్యాయని విమర్శించారు. అపుడు కేసీఆర్ వరి వేస్తే ఉరి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డు వరి వేస్తే ఉరి వేస్తానంటున్నాడని మండిపడ్డారు.