17 August, 2026 | 12:20 AM

ఇస్తామంటే.. వద్దంటున్నారు!

24-05-2024 01:51 AM

రెండేళ్లుగా ఒక్క దరఖాస్తు రాలేదు 

లైసెన్స్ అథారిటీ కోసం 

ఆసక్తి చూపని ప్రయివేటు డ్రైవింగ్ స్కూల్స్ నిర్వాహకులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (విజయక్రాంతి):  ప్రయివేటు డ్రైవింగ్ స్కూళ్లలో జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ విధానం అమల్లోకి రానుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2022లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండేళ్లుగా అమలు కాని ఈ విధానం జూన్ 1 నుంచి అమలు కానున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆర్‌టిఓ పాలసీపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. ఆర్టీఏ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడానికి పెద్ద మొత్తంలో స్థలం ఉండాలనే నిబంధన ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ కారణంగానే ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు లైసెన్స్ అథారిటీ పొందడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 

2022లోనే కేంద్రం మార్గదర్శకాలు

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఆర్టీఓ కార్యాలయాలలో వాహనదారులకు అందించే వివిధ సేవలలో భారీ మార్పులు చేపట్టింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానాన్ని ప్రయివేటు డ్రైవింగ్స్ స్కూల్స్, వ్యక్తులకు అప్పగించాలని భావించింది. అందుకు అనుగుణంగా 2022లోనే ప్రత్యేక ఉత్తర్వ్యులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్రైవేటు డ్రైవింగ్ లైసెన్స్ అథారిటీ పొందడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు డ్రైవింగ్ లైసెన్స్ అథారిటీ పొందడానికి శిక్షకులకు తప్పనిసరిగా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత, కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం, శిక్షణ ఇచ్చేందుకు టూ వీలర్ డ్రైవింగ్ అయితే 1 ఎకరం, ఫోర్ వీలర్ వాహనాల శిక్షణ కోసం కనీసం రెండెకరాల స్థలం ఉండాలనే నిబంధన పేర్కొంది. 

ఎకరాల నిబంధనే 

అడ్డంకిగా మారిందా..? 

సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు ఆన్‌లైన్ విధానం అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్నది. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను షోరూంలకే ఇవ్వాలనే ప్రతిపాధన కూడా కేంద్రం తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానాన్ని సైతం ప్రయివేటు వ్యక్తులు లేదా సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, టౌలీచౌకి, బహదూర్ పురా, మలక్‌పేట ప్రాంతాలలో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 209 ప్రయివేటు డ్రైవింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి.

ప్రస్తుతం ప్రయివేటు డ్రైవింగ్ స్కూల్స్‌లో డ్రైవింగ్ శిక్షణ మాత్రమే పొంది.. ఆ తర్వాత ఆర్టీఏ కార్యాలయం నుంచి లైసెన్స్ పొందపొండానికి దరఖాస్తు చేయాల్సి వస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ప్రయివేటు అథారిటీ కోసం ఎకరం నుంచి రెండెకరాల విస్తీర్ణంలో స్థలం ఉండాలనే నిబంధన ఉంది. ఇప్పటి వరకు కమర్షియల్ షెట్టర్ ఏర్పాటు చేసుకుని, రోడ్డుపైనే వాహనాలు నిలుపుకుని డ్రైవింగ్ స్కూల్స్ నడిపే నిర్వాకులు ఒక్కసారిగా కొత్త విధానం ప్రకారం ఎకరాల స్థలం సమీకరించాల్సి రావడమే పెద్ద ఆటంకంగా మారింది. దీంతో గ్రేటర్‌లో కానీ, మరే ఇతర ప్రాంతాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రయివేటు డ్రైవింగ్ లైసెన్స్ అథారిటీ కోసం దరఖాస్తులు రాలేదని తెలుస్తున్నది. 

దరఖాస్తులు వస్తే పరిశీలిస్తాం: సి. రమేష్

డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చే విధానంలో రెండేళ్లుగా ఒక్క దరఖాస్తు రాలేదు. వాస్తవానికి దీనికి సంబంధించిన ఉత్త ర్వ్యులు రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిబంధనలలో టూ వీలర్ టెస్ట్‌కు 1 ఎకరం, ఫోర్ వీలర్ టెస్ట్‌కు 2 ఎకరాల స్థలం ఉండాలనే నిబంధన ప్రయివేటు వ్యక్తులకు కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. అందుకే ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదని భావిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ప్రయివేటు వ్యక్తుల నుంచి గానీ, ప్రయివేటు సంస్థల నుంచి గానీ డ్రైవింగ్ లైసెన్స్ అథారిటీ కోసం దరఖాస్తు చేస్తే ఆయా దరఖాస్తులను పరిశీలించి, అనుమతులు జారీ చేస్తాం.