జూన్ రెండోవారంలో రాష్ట్రంలోకి నైరుతి
ఈ నెల చివర్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
జూన్ 2 నుంచి ౧౧ మధ్య తెలంగాణలోకి ప్రవేశం
భారత వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెల చివరి నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని, జూన్ ౮ నుంచి ౧౧వ తేదీ మధ్యలో రాష్ట్రంలోకి వస్తాయని పేర్కొన్నది. బంగాళాఖాతంలో రుతుపవనాల కదిలిక చురుకుగా ఉన్నదని వెల్లడించింది. ఈ నెల ౨౨న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన ౨౪ గంటల్లో వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో 67.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి సర్కిల్ 24లో 15.5 మిల్లీమీటర్లు నమోదైనట్టు వెల్లడించింది.
వాన సమాచారం కోసం మేఘదూత్ యాప్
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మేఘదూత్ యాప్ ఉపయోగ కరంగా ఉన్నది. ప్రధానంగా వానకాలంలో దీని ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. మెరుపులు, ఉరుముల నుంచి రక్షించుకోవడానికి, వర్షం ఎప్పుడు ఎక్కువగా కురిసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు వీలుగా సెంట్రల్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ యాప్ రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. ఆండ్రాయిడ్ మొబైల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం మన చేతిలో ఉంటుంది. అలాగే డామిని యాప్ ద్వారా మెరుపులు, పిడుగుల సమాచారం తెలుసుకోవచ్చు.






