23 July, 2026 | 12:21 PM

విత్తనాల నిల్వపై ప్రత్యేక నిఘా

01-06-2024 01:04 AM

ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం

ఆదిలాబాద్, మే 31 (విజయక్రాంతి):  విత్తనాల నిల్వ, రవాణాపై పక్కా నిఘా ఉంటుందని, అందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలుచోట్ల గోదాములను సందర్శించారు. గోదాము సిబ్బందితో మాట్లాడి విత్తన నిల్వలు, రవాణా అంశాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 36 విత్తన గోడౌన్స్‌పై నిఘా ఉంటుందన్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శంకర్‌గూడ, ఆనంద్‌పూర్, పిప్పరవాడ, లక్ష్మిపూర్, ఘన్పూర్ వద్ద చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచుతామన్నారు. పర్యటనలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, సీఐలు సత్యనారాయణ, అశోక్ ఉన్నారు.