ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ
యాదాద్రి భువనగిరి, మే 31 (విజయక్రాంతి): మహిమాన్విత స్వయంభూ యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయ సన్నిధిలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ, లక్ష్మీనృసింహులకు నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయంలో ఆండాల్ అమ్మవారిని పట్టువస్త్రాలు, ముత్యాల బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా అలంకరించారు. మహిళలు కుంకు మార్చనలు జరిపారు. సాయంత్రం అమ్మవారిని మంగళవాయిద్యాలు, వేద మంత్ర పారాయణాలతో తిరువీధుల్లో ఊరేగిస్తూ అద్దాల మండపంలో ఊయలలో అధిష్టింప చేశారు. లక్షనామ స్త్రోత్ర పారాయణాలతో అమ్మవారికి హారతులు నివేదిస్తూ ఊంజల్ సేవను కనులవిందుగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో హోమ పూజలు జరిపి నిత్యకల్యాణం నిర్వహించారు. స్వామివారికి శుక్రవారం భక్తుల నుంచి రూ. 32,45,945 ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు తెలిపారు.
యాదాద్రి నృసింహుడికి కాసుల వర్షం
యాదాద్రి లక్ష్మీనృసింహుడికి మే మాసంలో కాసుల వర్షం కురిసింది. మే మాసం వేసవి సెలవుల కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్వామివారి ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రూ. 18,43,02,315 ఆదాయం సమకూరింది. ఇందులో రూ. 14, 49,14,223 నెల రోజుల పాటు రోజువారి కైంకర్యాలతో సమకూరగా స్వామివారి హుండీలో కానుకలుగా 3,93,88,092 నగదు రూపంలో భక్తులు సమర్పించుకున్నారు. ఇవి కాకుండా 170 గ్రాముల బంగారం, 7కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ రూపంలో పెద్దమొత్తంలో ఆదాయం వచ్చింది. దేవస్థానం చరిత్రలోనే అత్యధికంగా మే 26న రూ. 1,02,68,099 నిత్యాదాయంగా రికార్డు. అదే విధంగా హుండీ కానుకల్లో కూడా మే 29న జరిపిన కానుకల లెక్కింపులో రూ. 3,93,88,092 మరో రికార్డుగా అధికారులు ప్రకటించారు.






