23 July, 2026 | 10:52 AM

ఆత్మహత్యకు ముందు అవయవాల దానం కోరిన ఇంజినీరింగ్ విద్యార్థి

23-07-2026 10:18 AM

నర్సాపూర్‌లో ఉరివేసుకుని బలవన్మరణం.. 

తన మృతికి ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్

నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో తన అవయవాలు అవసరమైన వారికి దానం చేయాలని, ఒకవేళ అవి ఉపయోగపడక పోతే తన శరీరాన్ని శాస్త్రీయ పరిశోధనలు, వైద్య ప్రయోగాలకు విరాళంగా ఇవ్వాలని కోరడం అందరినీ కదిలించింది. పోలీసుల వివరాల ప్రకారం, అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజి తాండకు చెందిన మేతిపోలే శివశంకర్ (20) నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్‌ఐటీ (BVRIT) కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

అతను మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నర్సాపూర్ పట్టణంలోని సిటీ ప్యాలెస్ సమీపంలో అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు.మంగళవారం స్నేహితులు బయటకు వెళ్లిన సమయంలో గదిలో ఒంటరిగా ఉన్న శివశంకర్ నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన స్నేహితుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూసైడ్ నోట్ పంపించాడు. ఆ నోట్‌లో తాను చాలా కాలంగా చనిపోవాలనే ఆలోచనతో బాధపడుతున్నానని, ఈ నిర్ణయం పూర్తిగా తన ఇష్టప్రకారమే తీసుకున్నానని పేర్కొన్నాడు.

తన తల్లిదండ్రులు తనకు ఎంతో అండగా నిలిచారని, తనకు ప్రేమ వ్యవహారం వంటి వ్యక్తిగత సమస్యలు ఏవీ లేవని, అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో చెప్పలేనని రాశాడు. తన మృతికి ఎవరినీ బాధ్యులను చేయవద్దని కూడా స్పష్టం చేశాడు.అలాగే, ఆత్మహత్య అనంతరం తన అవయవాలు ఉపయోగపడే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తన శరీరాన్ని శాస్త్రీయ పరిశోధనలు, వైద్య విద్య కోసం ఉచితంగా విరాళంగా ఇవ్వాలని కోరాడు. జీవితంలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.