23 July, 2026 | 10:25 AM

రక్షణ దళాల్లో స్థానం గొప్ప వరం

23-07-2026 09:52 AM

అందుకు అంకిత భావం, కఠోర శ్రమ, ఆత్మ స్థైర్యం అవసరం.

ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో లక్ష్యం కోసం నిరంతరం కృషి చేస్తే దేశ రక్షణ దళాల్లో స్థానం సంపాదించడం ఖాయమని నాగర్‌ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఉదయ్ ఆర్మీ అకాడమీని సందర్శించిన ఆయన శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మమేకమై వారి లక్ష్యాలు, శిక్షణ విధానంపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి రన్నింగ్ చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు శిక్షణ కోసం ప్రత్యేక గ్రౌండ్ అవసరాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఇప్పటికే స్టేడియం మంజూరైందని, తగిన స్థలాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఉదయ్ ఆర్మీ అకాడమీ గతంలో శిక్షణ పొందిన 39 మందిలో 37 మంది భారత ఆర్మీలో ఎంపిక కావడం విశేషమని, ప్రస్తుతం 100 మంది విద్యార్థులు దేశ సేవే లక్ష్యంగా కఠిన శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, పలువురు నాయకులు, అకాడమీ నిర్వాహకులు పాల్గొన్నారు.