13-11-2025 12:00:00 AM
రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహనా కల్పించాలి
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 12, (విజయక్రాంతి):రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఎస్వీ రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ శ్రీ లక్ష్మీ, ఎస్త్స్ర రవి, సిబ్బంది పాల్గొన్నారు.